భువనగిరి కోర్టుకు పాశం శ్రీను


భువనగిరి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును పోలీసులు బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. పీడీ యాక్టు కింద ఇప్పటికే వరంగల్ జైలులో ఉన్న శ్రీనును.. పీటీ వారంట్‌లో భాగంగా భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. అతడి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం నమోదైన పలు కేసుల్లో పాశం శ్రీనును విచారించేందుకు సిట్ అధికారులు.. తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు.



 పోలీసు కస్టడీకి ఫయీమ్ దంపతులు

 నయీమ్ సన్నిహితులు ఫయీమ్‌తో పాటు అతని భార్య షాజీదా షాహీన్‌లను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి కస్టడీకి అనుమతించారు. ఇక నయీమ్ వంట మనిషిగా పేర్కొంటున్న ఫర్హానా, అఫ్సాలను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వారిని ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి ఇచ్చినందున మరోసారి ఇవ్వలేమని పేర్కొన్నారు. మరోవైపు నయీమ్ భార్య హసీనాతో పాటు అక్క సలీమాను ట్రాన్సిట్ వారంట్‌పై విచారించేందుకు అనుమతివ్వాలని ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో నార్సింగి పోలీసులు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకునేందుకు పీటీ వారంట్‌లు జారీ చేయాలని కోరారు. దీనిపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. హసీనా, సలీమాలను ఇప్పటికే షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేయగా.. మహబూబ్‌నగర్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top