అడ్డూ అదుపూ లేని ఆగడాలు

అడ్డూ అదుపూ లేని ఆగడాలు - Sakshi


టీ సర్కారుపై పరకాల మండిపాటు

టీ పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించారు


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. వారికి చట్టం అంటే గౌరవం లేదని, సంప్రదాయాల్ని పాటించాలన్న స్పృహ కూడా లేదని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నీరు, విద్యుత్, సంస్థలు, నిధులు సంబంధిత అంశాల్లో చట్టాలను గౌరవించకుండా రోజు రోజుకూ యాగీ చేస్తోందని మండిపడ్డారు.



శుక్రవారం సచివాలయంలో  విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మిక శాఖకు చెందిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల మండలి నిధుల అంశంలో తెలంగాణ  పోలీసు అధికారుల ఆగడాలు, దౌర్జన్యాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. 50 మంది తెలంగాణ  పోలీసు అధికారులు గూండాల్లా వ్యవహరిస్తూ ఏపీ అధికారులపై దౌర్జన్యానికి తెగబడ్డారన్నారు. ఉన్నతాధికారులని కూడా చూడకుండా వారి ఇంటికి వెళ్ళి మరీ కుటుంబసభ్యుల్ని ఘెరావ్ పేరిట హింసిం చారని ఆరోపించారు.



విచారణ పేరుతో తెలంగాణ  పోలీసులు ఏ ఒక్క ప్రాతిపదిక పాటించలేదని, ఆ ప్రభుత్వం చెబుతున్న మాటలు, లెక్కల పై తెలుగు ప్రజల్లో  చర్చ జరగాలన్నారు. తాను లెక్కలు మొత్తం తీసి తెలంగాణ  ప్రభుత్వంతో నిజం కక్కించేవరకు విశ్రమించబోనన్నారు. ఈ సందర్భంగా పరకాల వివరాలను సోదాహర ణంగా చెప్పారు.  పంపిణీ జరిగితే ఈ నిధులు ఏపీకి చెందుతాయన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోకుండా యాగీ చేసిందన్నారు. ఏపీ అధికారులపై ఈగ వాలినా సహిం చమన్నారు.



ఆ అధికారులు, పోలీసులు పూనకాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భూ భాగంలోని బ్యాంకుల్లో వారికి దక్కాల్సిన వాటా కంటే అదనంగా రూ.76 కోట్లు జమయినా తాము పైసా తరలించలేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. నాక్, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని పరకాల ఆరోపించారు. ఉన్మాదంతో వ్యవహరిస్తున్న టీ ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు ప్రశ్నించాలని,కేంద్రం ఆరా తీయాలని అన్నారు. గవర్నర్  జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top