మేం తప్పు చేయలేదు..

మేం తప్పు చేయలేదు.. - Sakshi


ప్రత్యేక హోదా కోసమే మా ఆరాటం

- సభా హక్కుల కమిటీకి వివరణ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

- కమిటీ ఎదుట నలుగురు హాజరు..

- తదుపరి హాజరవుతామన్న చెవిరెడ్డి, కొడాలి నాని

 

 సాక్షి, హైదరాబాద్: ‘మేం తప్పూ చేయలేదు.. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా కోసమే ఆరాటపడ్డాం.. అంతే తప్ప స్పీకర్ పట్ల గాని, మరే ఇతర సభ్యుల పట్ల గాని అసెంబ్లీలో అగౌరవంగా ప్రవర్తించలేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో జరిగిన శాసనసభా సమావేశాల్లో జరిగిన సంఘటనలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సభా హక్కుల కమిటీ జారీ చేసిన నోటీసులను అనుసరించి మంగళవారం నలుగురు ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశమైన హక్కుల సంఘం ముందు వీరు వాదనలు వినిపించారు.



దాడిశెట్టి రాజా (తుని), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), రాచమల్లు శివప్రసాదరెడ్డి(ప్రొద్దుటూరు) హాజరు కాగా కమిటీ సభ్యులు వారిని విడివిడిగా పిలిచి వివరణ తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(చంద్రగిరి) తాను పోలీసు కేసుల్లో కోర్టులకు హాజరు కావాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని లేఖ ద్వారా వర్తమానం పంపారు. కొడాలి నాని(గుడివాడ) తన సమీప బంధువు మృతి వల్ల రాలేక పోతున్నట్లు లేఖ ద్వారా కమిటీకి తెలియ జేశారు. తదుపరి తమను పిలిస్తే వచ్చి వివరణ ఇస్తామని వారిద్దరూ సమావేశం ప్రారంభానికి ముందే తెలియజేశారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశానికి చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులు హాజరు కావాల్సి ఉండగా తొలుత అధ్యక్షుడు గొల్లపల్లి, సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ మాత్రమే హాజరయ్యారు.  కాగా, సమావేశం ప్రారంభానికి ముందే ఈ నలుగురు ఎమ్మెల్యేలు నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానాలు విడివిడిగా ఇచ్చారు. ఆ తరువాత 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హక్కుల కమిటీ సమావేశం వివరాలిలా ఉన్నాయి.



 ఎక్కడ తప్పు చేశానో చెప్పండి?

 వీడియో దృశ్యాల్లో ఉన్నది తానేనని చిర్ల జగ్గిరెడ్డి అంగీకరిస్తూ అసలు తానెక్కడ తప్పు చేశానో చెప్పాలని కమిటీ సభ్యులను అడిగా రు. ‘పోడియం వద్దకు ఎమ్మెల్యేలు వచ్చి నినాదాలు చేయడం కొన్ని వందలసార్లు జరిగింది. రాష్ట్రమంతటా ప్రత్యేక హోదా కావాలని, ప్యాకేజీకి చంద్రబాబు స్వాగతం పలకడం తప్పని రగిలిపోతుంటే వారి మనోభావాలనే సభలో మేం ప్రతిబింబించాం తప్ప మరొకటి కానే కాదు’ అని వివరణ ఇచ్చారు. పైగా తాను పోడియం వద్దకు వచ్చి నిలబడ్డానే తప్ప అసభ్యంగా ఏమీ మాట్లాడలేదన్నారు.



 దాడిశెట్టిని అడ్డుకున్న చైర్మన్

 తామెందుకు అసెంబ్లీలో పోడియం వద్దకు వెళ్లి ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుపట్టాల్సి వచ్చిందో చెప్పడానికి దాడిశెట్టి రాజా ఉద్యుక్తులు కాగా సూర్యారావు అడ్డుకుంటూ ‘ఆ వివరణ అక్కర లేదు. సంఘటన గురించే వివరణ ఇవ్వండి’ అన్నారు. పెద్దిరెడ్డి జోక్యం చేసుకుని... ‘ఆయన చెప్పేది వినాలి కదా’ అని వారించారు. తిరుపతిలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి మోసం చేశారని రాజా చెబుతూ ఉండగా ‘తిరుపతి అంటారు... ఆ తరువాత అన్నవరం అంటారు... అదంతా వద్దు ... విషయం చెప్పండి’ రాజా వివరణను మధ్యలోనే అడ్డుకున్నారని తెలిసింది.

 

 టీడీపీ వారు చేసింది తప్పు కాదా?

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సభ్యులు లెక్కలేనన్ని సార్లు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి చుట్టుముట్టిన సందర్భాలు ఉన్నాయని, అది తప్పు కానపుడు ప్రత్యేక హోదా కోసం తమ ఆవేదన వినిపించడానికి స్పీకర్ వద్దకు వెళితే తప్పయిందా? అని రాచమల్లు ప్రశ్నించారు. స్పీకర్‌ను అగౌరవ పర్చడం గాని, సభలో మరో సభ్యుడిని దుర్భాషలాడ్డంగాని తాము చేయలేదన్నారు. హోదా కావాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడంలో టీడీపీ వారు కూడా భాగస్వాములని, కేంద్రం ప్యాకేజీ అన్నపుడు వారు మిన్నకుండిపోవడం అంటే సభలో చేసిందానికి భిన్నంగా వ్యవహరించినట్లని చెప్పారు. నోటీసులు ఇవ్వాల్సింది వారికైతే (టీడీపీ), తీర్మానానికి అనుగుణంగా హోదాపై చర్చకు పట్టుబట్టిన తమకు నోటీసులు ఇవ్వ డం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top