ఆ‘పరేషాన్!’

ఆ‘పరేషాన్!’


ఉస్మానియా ఆపరేషన్ గదులకు తాళం

చికిత్సలకు అంతరాయం

ఆందోళనలో రోగులు...

పట్టించుకోని అధికారులు


 

సిటీబ్యూరో:  ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్ లేకపోవడంతో ఓపీ గదులే కాదు... ఆపరేషన్ థియేటర్లు సైతం మూతపడుతున్నాయి. వైద్యులు లేకపోవడంతో న్యూరోఫిజీషియన్ ఓపీ గదికి ఇప్పటికే తాళాలు పడ్డాయి. నర్సులు, వార్డు బాయ్స్ లేమితో తాజాగా జనరల్ సర్జరీ విభాగంలోని ఆపరేషన్ థియేటర్-3 గదికి తాళాలు పడ్డాయి. దీంతో ఆ విభాగంలో శస్త్రచికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడి రోగుల అవసరాలు పూర్తిగా తీర్చాలంటే కనీసం 835 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ప్రస్తుతం 309 మంది మాత్రమే ఉన్నారు. వైద్యులు లేక కొన్ని విభాగాలు... వైద్య పరికరాలు, స్టాఫ్ నర్సులు లేక మరికొన్ని విభాగాలు మూత పడుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.



పేరుకే బయోమెట్రిక్ హాజరు



సుమారు 1100 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి నిత్యం 1400 నుంచి 1600 మంది రోగులు వస్తుంటారు. ఇక్క డ నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా... వీటిలో ఇప్పటికే రెండు మూతపడ్డాయి. ఆరు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో చిన్నాపెద్ద కలిపి నిత్యం సుమారు 150 సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 22 విభాగాలుంటే, 200పైగా వైద్యులు పని చేస్తున్నారు. వీరిలో సగం మంది అసలు ఆస్పత్రికే రావడం లేదు. ఒక వేళ వచ్చినా...ఓపీకి వెళ్లకుండా గదులకే పరిమితమవుతున్నారు. కొంతమంది దంపతులూ ఇక్కడ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆస్పత్రికి వచ్చి ఇద్దరి సంతకాలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమలు చేశారు. దీన్ని ఉపయోగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. స్టాఫ్‌నర్సుల కొరత వల్ల రోగి బంధువులే సంరక్షకులుగా మారుతున్నారు. వార్డులకు తరలించడం మొదలు సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం వంటి కీలక పనులన్నీ వారే చేయాల్సి వస్తోంది. ఎంఆర్‌డీ సెక్షన్‌లో సిబ్బంది కొరత వల్ల మెడికో లీగల్ కేసుల రికార్డులను పోలీసులే వెతుక్కోవాల్సి వస్తోంది. మరోవైపు కీలకమైన రికార్డులు మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.



మొరాయిస్తున్న యంత్రాలు



రేడియాలజీ విభాగంలో పది ఎక్సరే యంత్రాలు ఉండగా.. వీటిలో ఇప్పటికే సగం మూలకు చేరాయి. సిటీస్కాన్ గడువు ముగియడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సాధారణ రోగులు ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్ తీయించుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు పేరు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. రోగుల కోసం కేటాయించిన పేయింగ్ రూమ్‌ల్లో పరిపాలనాపరమైన పనులు నిర్వహిస్తున్నారు. రోగులను ఆఫరేషన్ థియేటర్లకు తరలించే లిఫ్ట్‌లు పని చేయకపోవ డంతో ఇటీవల ఏకంగా సర్జరీలనే వాయిదా వేయాల్సి వచ్చింది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top