మిగిలింది మూడు వారాలే..

మిగిలింది మూడు వారాలే.. - Sakshi


‘దేశ భద్రత దృష్ట్యా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనం చరిత్ర ఆ నంబర్ ప్లేట్‌లో నిక్షిప్తమై ఉండాలి. వాహనాలు ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలి’ -- ఇది సుప్రీంకోర్టు ఆదేశం.




 ‘వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసే విధంగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఏర్పాటు చేస్తాం. 2015 డిసెంబర్

 15వ తేదీ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. రాష్ర్టంలో ఉన్న అన్ని వాహనాలకు ఈ గడువులోగా బిగిస్తాం’ -- రవాణాశాఖ సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణ.

 

 సాక్షి,సిటీబ్యూరో: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ ఏడాది డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో అమలులో జాప్యం నెలకొంది. తిరిగి 2014 నుంచి ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం 6 లక్షల వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. కొత్త వాహనాలతో పాటు పాతవాటికి కూడా వీటిని బిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్న గడువు డిసెంబర్ 15తో ముగియనుంది. కానీ పాతవి కాదు కదా కొత్త వాటికే సకాలంలో బిగించలేక పోతున్నారు. ఇంకా 40 లక్షల వాహనాలకు ఈ నంబర్ ప్లేట్లు అమర్చాల్సి ఉంది.




 ఈ జాప్యం ఎందుకు ..?

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ యూనిట్‌లు ఏర్పాటు చేశారు. గ్రేటర్‌లో ప్రతి రోజు రిజిస్ట్రేషన్ అయ్యే సుమారు 800 వాహనాలకు కనీసం 4 రోజుల వ్యవధిలో నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కానీ 30 రోజులు దాటినా నంబర్ ప్లేట్లు అమర్చడం లేదు.


రోజుకు 200 వాహనాలకు కూడా నెంబర్ ప్లేట్ల ను అమర్చలేక పోతున్నారు. ఈ ప్రాజెక్టును కాంట్రాక్ట్‌కు తీసుకున్న లింక్ ఆటోటెక్ సంస్థ.. వాహనాల డిమాండ్‌కు తగిన స్థాయిలో నంబర్ ప్లేట ్లను తయారు చేయడం లేదు. కేవలం ఒక్క యూనిట్ ద్వారానే నంబర్ ప్లేట్లను తయారు చేస్తున్నారు. లింక్ ఆటోటెక్ నిర్లక్ష్యం, ఆర్టీసీ, రవాణా శాఖ మధ్య సమన్వయ లోపం ఈ జాప్యానికి మరింత కారణమవుతోంది.

వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్ కోసం రూ.350 నుంచి రూ. 650 వరకు ఫీజు తీసుకుంటున్నారు. కానీ సకాలంలో వాటిని అమర్చక పోవడం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.


 ఆర్టీఏ చేపట్టిన చర్యలు..


రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పలుమార్లు లింక్ ఆటోటెక్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సకాలంలో నంబర్ ప్లేట్‌లు ఏర్పాటు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ సంస్థలో ఎలాంటి చలనం లేదు. దీంతో ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనదారులు ఆర్టీఏ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top