పంట రుణాలనే మాఫీ చేస్తానన్నా

పంట రుణాలనే మాఫీ చేస్తానన్నా - Sakshi


టీడీపీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు

* ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు రద్దు చేస్తామని హామీ ఇచ్చా

* మొదటి విడత చెల్లించిన తర్వాత రుణాలు రీషెడ్యూలు చేయిస్తాం

* డ్వాక్రా మహిళలు ఎక్కడంటే అక్కడ డబ్బులు తీసుకోవడం వల్లే అప్పులు


 

సాక్షి ప్రతినిధి, విజయవాడ:
రైతులు పంట పైన తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని చెప్పామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా రూ.1.50 లక్షలు మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చానన్నారు. మహిళలు ఎక్కడంటే అక్కడ రుణాలు తీసుకోవడం వల్ల తిరిగి చెల్లించే శక్తి లేక అప్పుల ఊబిలో చిక్కుకుపోయారని వ్యాఖ్యానించారు.



గురువారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహిం చారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల ప్రతినిధులు హాజరైనా   ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు 113 మంది ఆహ్వానితులు డుమ్మా కొట్టడం గమనార్హం. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..



ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సంతకాలు పెట్టాను.  వీటిలో రైతుల రుణాల మాఫీ ముఖ్యమైనది. అయితే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తాం. తర్వాత రుణాలు రీషెడ్యూల్ చేయిస్తాం.  ఈ నెలాఖరులోగా ఈ హామీని నిలబెట్టుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆరు నెలల్లోపు దీనిని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం.



డ్వాక్రా సభ్యులు ప్రతి ఒక్కరికీ రూ. 10 వేల చొప్పున రుణ విముక్తులను చేస్తామని హామీ ఇచ్చాం. కొన్ని బ్యాంకులు రుణాలకు వడ్డీ తీసుకుంటున్నాయి. మహిళలు వడ్డీ కడితే తిరిగి ఇస్తాం. వడ్డీ కట్టకపోతే పూర్తిగా చెల్లిస్తాం.



రైతులను రుణ విముక్తులను చేయడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు సాధికారిత సంస్థ పెట్టాం.



రాష్ట్రమంతా ఇసుకను ఇష్టానుసారంగా దోచుకున్నారు. అందుకనే డ్వాక్రా సంఘాలకు ఇచ్చాం.  వాళ్లకు ఖర్చులు ఇస్తాం. పని కల్పిస్తాం. ్హ కరెంటు విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి.  ఇప్పుడు ఇళ్లకు 24 గంటలు, వ్యవసాయానికి  7 గంటలు కరెంటు ఇస్తున్నాం.



ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ్హ ఎర్రచందనం దొంగల భరతం పడతాం. స్మగ్లర్లు పగలంతా రాజకీయాలు చేస్తారు. రాత్రులు స్మగ్లింగ్ చేస్తారు.



కరెంటు, సాగునీటి విషయంలో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న దానినే అమలుచేస్తున్నాం. కానీ, దాన్ని వక్రీకరించి సమస్యలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదని అక్కడుండే వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను.



గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి పెన్నాలో కలిపితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top