ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ కోర్సులు

ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ కోర్సులు


♦ 130 డిగ్రీ కాలేజీల్లో శ్రీకారం

♦ 80 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం

♦ ఐఐటీ-బాంబేతో సర్కారు ఒప్పందం

 

 సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. విద్యను మూస ధోరణిలో కాకుండా పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడేలా సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా ఐఐటీ-బాంబేకి చెందిన స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమక్షంలో కమిషనర్ వాణి ప్రసాద్, స్పోకెన్ ట్యుటోరియల్ ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ శ్యామ అయ్యర్‌లు బుధవారం సచివాలయంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.



దాదాపు 80వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా కళాశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సీ, డాట్‌నెట్, జావా వంటి 40 రకాల కంప్యూటర్ కోర్సులను అందించనున్నారు. విద్యార్థులు తమకిష్టమైన వాటిని వారి కాలేజీలోనే ఎంపిక చేసుకుంటే ఆన్‌లైన్‌లోనే తర్ఫీదు ఇస్తారు. ప్రతీ కోర్సుకు కొన్ని గంటలు కేటాయిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకుగాను 40 వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. వారికి స్పోకెన్ ట్యుటోరియల్ తరఫున సర్టిఫికెట్ అందజేస్తారు. ముఖ్యమైన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అర్హతకు చెల్లుబాటవుతుంది.



 ఉపాధి కల్పనే ధ్యేయం: కడియం

 ఉపాధి అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండటం కోసమే కళాశాలల్లో ఆన్‌లైన్ కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. అలాగే కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ‘టాక్ టు ఎ టీచర్’లో భాగంగా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఉచితంగా ఐసెట్‌లో ప్రావీణ్యం పెంపొందిస్తోందన్నారు.ప్రముఖులు రూపొందించిన నాణ్యమైన సాఫ్ట్‌వేర్‌ను తాము కూర్చున్న చోటునుంచే విద్యార్థులు ఉచితంగా నేర్చుకునే వీలు క లుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పాల్గొన్నారు.

Election 2024

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top