హగ్‌ ఇస్తుంది ధైర్యం..భరోసా

హగ్‌ ఇస్తుంది ధైర్యం..భరోసా


► బాధల్లో ఉన్నవారిని హత్తుకుంటే రిలీఫ్‌  

► నేడు హగ్‌ డే




ప్రేమనేది అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే పుట్టిన బిడ్డ ప్రపంచంలోకి రాగానే తల్లిని హత్తుకుని పడుకుంటుంది. ఆమె స్పర్శలో ఉండే ధైర్యం ప్రపంచంలో మరెవరూ ఇవ్వలేరు. మనం ఓడిపోయినప్పుడు ఓదార్పు కోసం ఆత్మీయుల స్పర్శ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మనిషిని మనిషిగా గుర్తించగలిగే ప్రేమను ఆత్మీయ ఆలింగనం కొండంత బలాన్ని ఇస్తుంది.  



శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో చిరాకుగా ఉన్న కాంపౌండర్‌ను హత్తుకునే సన్నివేశంలో హీరో ప్రేమ ఒక చిన్న కౌగిలింతతో తెలుస్తుంది. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుతెచ్చుకున్న అమృతానందమయి అమ్మ కూడా భక్తులకు తన స్పర్శ ద్వారానే ప్రేమను చాటుతుంది. ఎన్ని కోట్లున్నా ఒంటరిగా అనుభవించడం ఏవరికీ చేతకాదు. అందుకే ప్రేమను తెలిపే ఆత్మీయ స్పర్శను హగ్‌ డేగా ప్రపంచం జరుపుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు ఒక్కో డేను జరుపుకుంటున్నారు ప్రేమికులు. ఆదివారం నిర్వహించే హగ్‌ డే ఇందులో భాగమే..  



విశాఖపట్నం : ప్రపంచ దేశాల్లో మనుషుల మధ్య కులం, మతం, రంగు, అంతస్తు, హోదా ఇవన్నీ అడ్డు గోడల్లా నిలిచిపోతాయి. వాటిని అధిగమించేందుకు కొంత మంది ఈ హగ్‌డేను జరుపుకుంటారు. కొంత మంది యువతీ యువకులు పబ్లిక్‌ ప్లేస్‌ల్లో ఫ్రీ హగ్స్‌ పేరుతో బోర్డు పెట్టి నిలబడతారు. అంటే  తమకు అంతస్తు, రంగు వంటి బాహ్య విషయాలపై ఆసక్తి లేదని మనుషులనందరినీ దగ్గరకు చేర్చుకోవడం ఇష్టమని అందువల్ల తనను ఎవరైనా హగ్‌ చేసుకోవచ్చని అర్థం. ఈ ప్రయోగం చాలా సక్సెస్‌ అయింది. కావాలంటే యూట్యూబ్‌లో ఫ్రీహగ్స్‌ అని టైప్‌ చేసి చూడండి చాలా వీడియోలు ఉంటాయి. ఏఆర్‌. రెహమాన్‌ ఫ్రీహగ్స్‌ పై జియాసే జియా అని ఒక ఫేమస్‌ ఆల్బమ్‌ కూడా చేశారు. ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య దూరాలు చెరిగిపోయేలా అందరం ఒక్కటవుదామనే నినాదంతో హగ్‌డే ప్రాధాన్యం సంతరించుకుంది.



ప్రేమికుల మధ్య..

అదే ప్రేమికుల మధ్య ఉండే ఆత్మీయత వేరు. పైన చెప్పినవన్నీ ప్రేమను అందించేవి కాని..  ఇక్కడ ప్రేమను కోరుకునేది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే అనుబంధం వారి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ వయసుతోపాటు పెరుగుతుంది. బ్రేకప్‌లతో విడిపోయే వారికి ఇవేమీ అర్థం కాకపోవచ్చు. కాని నిచ్చెలి చేతిలో చెయ్యివేసి కబుర్లు చెప్పుకోవడం హత్తుకోవడం జీవితాంతం మరచిపోలేని మధురానుభూతినిస్తుంది. అ స్పర్శ జీవితాంతం గుర్తుండిపోతుంది.  



హగ్‌డే ప్రేమికులకే కాదు...

హగ్‌డేను అపార్థం చేసుకునేవాళ్లు కూడా లేకపోలేదు. కేవలం ప్రేమికులకు మాత్రమే హగ్‌డే అనుకుంటే పొరబాటే. తాత మనవరాలిని, తండ్రి కూతురిని, తల్లి కొడుకుని, అన్న చెల్లెల్ని, స్నేహితుల మధ్య ఇలా ఒకరి ప్రేమను ఒకరికి తెలపడానికి హగ్‌ అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అందుకే హగ్‌డేకు అంత ప్రాధాన్యం ఉంది.



యువతీ యువకుల మధ్య...

హగ్‌డేను జరుపుకునే వారిలో యువతీ యువకులు, ప్రేమికులు కూడా ఉంటారు. ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని తెలపడానికే ఆలింగనం ఒక అసంకల్పిత చర్యగా భావించాల్సి ఉంటుంది. చాలా కాలం తరువాత స్నేహితుడ్ని లేదా స్నేహితురాలిని చూస్తే ఆశ్చర్యంతో పాటు మనకు తెలియకుండానే వాళ్లను హత్తుకుంటాం. అంటే దానర్థం దురుద్దేశం కాదుగా. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దశాల్లో వందల మంది స్టూడెంట్స్‌ హగ్గింగ్‌ క్యాంపెయిన్‌లు చేస్తారు. వాళ్లే మనుషుల దగ్గరికి వెళ్లి హగ్‌ చేసుకుంటారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top