వక్ఫ్‌భూములపై మండలిలో రభస


పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం: ఉపముఖ్యమంత్రి  

సంతృప్తి చెందని కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్


 

హైదరాబాద్: వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నివసించే ప్రాంతంలో ఉన్న వక్ఫ్ భూములు కూడా వేరేవారి ఆధీనంలో ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు చేసిన  విమర్శలు గురువారం శాసనమండలిలో రభసకు కారణమయ్యాయి. ఫారూఖ్ హుస్సేన్ అడిగిన ప్రశ్నపై ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో పాటు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, సలీం, రాములు నాయక్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు విపక్షనేత షబ్బీర్ అలీ నేతృత్వంలో వాకౌట్ చేశారు. రాష్ట్రంలో 23 వేల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయని, భూముల పరిరక్షణకు ఏర్పాటైన కమిటీలు ఏవీ పనిచేయలేడంలేదని రజ్వీ, షబ్బీర్ అలీ విమర్శించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.



2017లో కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 3.65 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకు రూ. 1,295 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశామని, ఈ బడ్జెట్‌లో రూ. 900 కోట్లు కేటాయించామని చెప్పారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కాటన్ కాార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

 

కళాశాల, వర్సిటీలకు సన్నబియ్యం: ఈటల

కళాశాలలు, విశ్వవిద్యాలయాల వసతి గృహాలకు కూడా వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.  అనాథలను పోషించే స్వచ్చంద సంస్థలు అడిగినా, సన్నబియ్యం సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు.

 

సత్ప్రవర్తన ఖైదీల విడుదల: నాయిని

జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సత్ప్రవర్తన గల వారిని విడుదల చేయనున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేందుకు పారితోషకాలను పెంచుతున్నట్లు చెప్పారు. కోచ్‌లకు కూడా ఇప్పుడున్న వేతనాలకన్నా రెట్టింపు ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. సరిహద్ధు చెక్‌పోస్టులను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇందుకోసం రూ. 10.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top