300 కోట్లు... చెల్లింపులకే సరిపోనున్నాయి!

300 కోట్లు... చెల్లింపులకే సరిపోనున్నాయి!


- మూడేళ్ల ఎన్ క్యాష్‌మెంట్‌పై నిషేధాన్ని తొలగించిన ఆర్టీసీ

అధికారుల పాత బకాయిల చెల్లింపునకు రంగం సిద్ధం

- ప్రభుత్వం నుంచి వచ్చే ‘తక్షణ సాయం’ నుంచి చెల్లింపులు

 

 సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆర్టీసీకి తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.300 కోట్లు బకాయిల చెల్లింపులకే సరిపోనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ మెడ పై కత్తిలా వేలాడుతున్న బకాయిల పోరు నుంచి బయటపడితే చాలన్నట్టుగా పరిస్థితి ఉండటంతో... కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన క్రెడెట్ కో-ఆపరేటివ్ సొసైటీ, పీఎఫ్‌లకు బాకీపడ్డ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే నిధులు వాటికే సరిపోనున్నాయి. పనిలోపనిగా ఇతరత్రా నిలిచిపోయిన బెనిఫిట్స్ చెల్లింపులనూ జరపాలని నిర్ణయించారు. ఆ నిధులు వస్తున్నట్టు తెలియగానే ముందుగా అధికారుల బస్‌పాస్ సరెండర్ చేయటం ద్వారా డబ్బులు చెల్లించే బస్‌పాస్ సరెండర్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. ఆర్టీసీ కష్టాల్లో ఉండటంతో 2013 నుంచి ఈ చెల్లింపులపై నిషేధం విధించారు. ఇప్పుడు ప్రభుత్వం రూ.300 కోట్లు ఇస్తుండటంతో తొలుత ఈ చెల్లింపులు జరిపేందుకు నిర్ణయించిన యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది.



 చెల్లింపు ఎలా అంటే..

 డిపో మేనేజర్ స్థాయి నుంచి ఈడీల వరకు బస్‌పాస్‌ను సరెండర్ చేసి దాని బదులు నగదు పొందే వీలుంది. అలా ఈడీలు, ఆర్‌ఎంలు, ఇతర విభాగాధిపతులకు సంవత్సరంలో రూ.15 వేలు చొప్పున మూడు పర్యాయాలు దాన్ని పొందొచ్చు. అంటే ఆ మూడు పర్యాయాలు వారు ఏవైనా పర్యటనలకు వెళ్తే బస్‌పాస్‌ను వినియోగించకుండా ఇతర రవాణా సాధనాలను వాడుకున్నట్టు ఆధారాలు చూపాలి. అంతమేర బిల్లులు దాఖలు చేయాలి. అంటే ఒక్కో అధికారికి సంవత్సరానికి రూ.45 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలా 2013 నుంచి 2015 వరకు అంటే మూడేళ్ల మొత్తం.. వెరసి రూ.1.35 లక్షలు అందుతాయి.



ఇక ఆ కిందిస్థాయి వారికి రూ.12 వేల చొప్పున చెల్లిస్తారు. అలా దాదాపు 250 మంది అధికారులకు అవకాశం ఉంటుంది. బస్‌పాస్‌ను సరెండర్ చేసి నగదు పొందే వెసులుబాటు కార్మికులకు లేదు. ఫలితంగా ఈ రూపంలో కార్మికులకు లబ్ధి ఏమీ ఉండదు. కానీ వారు ప్రతినెలా జీతం నుంచి నిర్ధారిత మొత్తాన్ని మినహాయించుకుని ప్రత్యేక నిధిగా ఉండే క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ, బెన్వలెంట్ అండ్ థ్రిఫ్ట్ స్కీం, పీఎఫ్ నిధులనూ ఆర్టీసీ వాడుకున్నందున కార్మికులకు రుణాలు లేకుండా పోయాయి. ఆ రూపంలో రూ.200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని కూడా ఇప్పుడు చెల్లించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top