సమ్మె..సమస్యలు

సమ్మె..సమస్యలు


డిస్కంలో పేరుకపోతున్న  విద్యుత్ ఫిర్యాదులు

కోతలు, ఓల్టేజ్ హెచ్చతగ్గులతో గ్రేటర్‌వాసులు సతమతం

నిలిచిన మీటర్ రీడింగ్, బిల్లుల వసూళ్లు

ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్న నేతలు


 

సిటీబ్యూరో: విద్యుత్ కాంట్రాక్ట్  కార్మికులు చేపట్టిన దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. కార్మిక సంఘం నేతలు మాత్రం ఇంకా ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్నారు. నేతల దీక్షకు మద్దతుగా సోమవారం ఉదయం మరోసారి మూకుమ్మడిగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మట్టడించాలని కార్మికులు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, వివిధ డిస్కంల పరిధిలోని సుమారు 22 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులంతా ఏడు రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఆయా విభాగాల్లో పనులన్ని పూర్తిగా స్తంభించిపోయాయి. లైన్ల పునరుద్ధరణ, కొత్త కనెక్షన్లు, కొత్త లైన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా, హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తినప్పుడు ఇంట్లో విలువైన గృహోపకరణాలు కాలిపోతున్నాయి. అంతేకాదు సర్వీసు వైర్లు కాలిపోతున్నాయి.

 

అంతటా అంధకారం..




విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్లను పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ఎఫ్‌ఓసీ కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదు. విద్యుత్ స్తంభాలు ఎక్కేందుకు కార్మికులు లేక పోవడంతో వినియోగదారులు రోజుల తరబడి అంధకారంలో మగ్గాల్సి వస్తోంది.  ఆసిఫ్‌నగర్ డివిజన్ దత్తాత్రేయనగర్ కాలనీలో సర్వీస్ నెంబర్ 030555 వినియోగ దారుడు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం స్థానిక ఏఈకి ఫిర్యాదు ఇచ్చినా..నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. శనివారం చాదర్‌ఘట్‌లో డిస్ట్రిబ్యూషన్ వైరు తెగిపడింది. వెంటనే స్థానికులు డిస్కం కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్‌లో ఆదివారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం స్థానికులు 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు.



నిలిచిన మీటర్ రీడింగ్..



 మీటర్ రీడింగ్ కార్మికులూ సమ్మెలో పాల్గొనడంతో గ్రేటర్ పరిధిలో రీడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిస్కం పరిధిలో వినియోగదారుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ప్రతి నెలా ఒకటి, రెండో తేదీల్లో మీటర్ రీడింగ్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. సోమవారం వరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. సకాలంలో రీడింగ్ తీయక పోవడంతో శ్లాబురేటు మారి వినియోగదారుని జేబుకు చిల్లుపడుతోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ యాజమాన్యం మీటర్ రీడింగ్‌పై ప్రత్యామ్నాయ దృష్టి సారించింది. డీఈ, ఏఈ, లైన్‌మెన్‌లతో పాటు ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చి బిల్లులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. అయితే తమ సమస్యను పరిష్కరించకుండా ఇతరులతో  రీడింగ్ తీయిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ  అడ్డుకుని తీరుతామని కార్మిక సంఘం నాయకుడు సాయిలు హెచ్చరించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top