అమ్మ మాట

అమ్మ  మాట


అంతర్జాతీయ మహిళా సదస్సు

 

ఇజ్రాయెల్‌లో పోస్ట్‌డాక్టోరియల్ కోర్స్ చేస్తున్న పొలెట్ షూస్టర్‌ను పలకరించి.. ఇజ్రాయెల్, పాల స్తీనా అంతర్యుద్ధం గురించి అడిగితే.. ‘నాకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. నా చిన్న కూతురు రెండేళ్లది. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే.. పాల స్తీనా మీద జరుగుతున్న దాడులను ఓ తల్లిగా చూస్తున్నాను. చాలా బాధేస్తోంది. ముక్కుపచ్చలారని పిల్లలు.. వాళ్లేం పాపం చేశారని? ఏ పిల్లాడికి చిన్న గాయమైనా తల్లి మనసు తల్లడిల్లుతుంది. ఇజ్రాయెల్‌లో తల్లులందరిదీ ఇదే పరిస్థితి. మా దేశంలో ఏ స్త్రీ ఈ దాడులను సమర్థించదు. బాంబు



విస్పోటాల శబ్ధాలకు వణికిపోతున్న మా పిల్లలను అక్కున చేర్చుకుని దాడులు ఎంత అమానవీయమో చెబుతున్నాం. మీరైనా ఈ పరిస్థితి మార్చాలని అడుగుతున్నాం’ అని ఆమె చెప్తుంటే.. పక్కనే ఉన్న జపానీ వనిత ఇత్సుకో యొనెజవా.. పొలెట్‌ను పలకరించింది. ‘పాలస్తీనాలో నాకు చాలా మంది స్నేహితులున్నారు. అంతర్యుద్ధంతో నలిగిపోతున్న పాలస్తీనావాసులు, ముఖ్యంగా చిన్నారుల ఫొటోలు టీవీల్లో, ఫేస్‌బుక్‌లో చూస్తుంటే ఇజ్రాయెల్ మీద కోపం వస్తోంది. ఈ పోస్ట్ మోడర్న్ డేస్‌లో కూడా తెగల మధ్య తగువులేమిటి ? ఆ రెండు దేశాల మూఢనమ్మకాలకు ఆ చిన్నారులెందుకు బలికావాలి.. ?’ అని ప్రశ్నించింది.

 

‘ఐయామ్ సారీ యొనెజవా! ఇది రిలీజియస్ ఇష్యూ కాదు’ అని పొలెట్ సమాధానం చెప్తుండగానే ‘మరేంటి పొలిటికల్ ఇష్యూనా.. ?’ అని రెట్టించింది జపాన్ లేడి. ‘ఎస్.. దిస్ ఈజ్ పొలిటికల్ ఇష్యూ..’ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ‘ఎన్నాళ్లిలా కొట్టుకుంటారు.. ఈ తరం అస్థిత్వం ఏమవుతుంద’ని ఆవేశానికి లోనైంది యొనెజవా. ‘టీవీలు, ఫేస్‌బుక్‌లో చూసి కన్‌క్లూజన్‌కు రాకూడదు. రెండువైపులా చూడాలి. ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల పాలస్తీనీయులు కనిపిస్తారు. అదే పాలస్తీనాలో ఇజ్రాయిల్ సిటిజన్ కనిపిస్తే కాల్చి చంపేస్తారు. ఈ అంతర్యుద్ధంలో మా దేశంలో ఉన్న పాలస్తీనీయులకు సురక్షితమైన శిబిరాల్లో ఆవాసం ఇస్తే.. పాలస్తీనాలో వాళ్ల పిల్లలను బాంబుల మధ్య దాచిపెడుతున్నారు. ఇలాంటి విషయాలపై ఎవరూ ఫోకస్ చేయర’ని అంతే ఆవేశంగా బదులిచ్చింది పొలెట్. వాతావరణం కాస్త చల్లబరుస్తూ ‘ఈ సమస్య పరిష్కారం కోసం మీ రెండు దేశాల మహిళలెందుకు ప్రయత్నించకూడదు? అని ప్రశ్నించింది ఇత్సుకో.

 ‘ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఈ సమస్య మీద ఇజ్రాయెల్‌లో ఉన్న ఉభయ దేశాల మహిళలం చాలా సార్లు సమావేశ మై చర్చించాం. రెండు దేశాల ప్రతినిధులకు కొన్ని వందల సార్లు మెమొరాండం పంపాం. ఇప్పటికీ మా ప్రయత్నాలు ఆగలేదు. మా వల్ల పరిస్థితి మారితే అంతకన్నా సంతోషం ఏముంటుంది. శాంతియుత చర్చలతోనే ఓ పరిష్కారం దొరుకుతుంద’ని అంది పొలెట్. ‘వి హోప్‌సో..పొలెట్’ తనూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ఇత్సుకో యొనెజవా!ఈ ఇద్దరు మహిళల సంభాషణ  రెండు దేశాల క్షేమాన్ని కాంక్షించింది.



 

పొలెట్ షూస్టర్




ఇంతకీ ఇజ్రాయెల్ దేశానికి చెందిన పొలెట్ ఇప్పటికే నాలుగు విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్‌లకు హాజరైంది. స్త్రీలకు సంబంధించిన భిన్న సమస్యల మీద ఎన్నో పేపర్‌ప్రెజెంటేషన్స్ ఇచ్చింది. ఇలాంటి సదస్సుల్లోనైనా తమ దేశాల మధ్య రగులుతున్న మంటలను ఆర్పే ఆయుధం దొరకుతుందని ఎదురుచూస్తోంది. ఆమె పేరును తెలుగులో రాయడం చూసిన పొలెట్.. లిపి బాగుందంటూ తన పిల్లల పేర్లను కూడా తెలుగులో రాయించుకుని ఆ కాగితాన్ని దాచుకుంది.

 

ఇత్సుకో యొనెజవా



ఇత్సుకో యొనెజవా ‘ఇంటర్నేషనల్ మామ్ అండ్ ఇన్‌ఫాంట్స్ గ్రూప్ కోలా అనే సంస్థలో టీచర్‌గా పనిచేస్తోంది. జపాన్‌లో ఉండే జ పానేతర మహిళలకు జపాన్ భాష నేర్పిస్తుంది. ఇత్సుకోకి ఇండియా కొత్తకాదు. మహారాష్ట్రలోని పుణేలో ఆమెకు చాలామంది స్నేహితులున్నారు. అప్పుడప్పుడూ పుణే వస్తుందట కూడా.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top