మా నిర్ణయం తేలకుండానే నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?

మా నిర్ణయం తేలకుండానే నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? - Sakshi


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పిస్తూ జారీ అయిన నోటిఫికేషన్ వ్యవహారంలో కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పించే విషయంలో పరిపాలన పరంగా హైకోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా ఏపీఏటీ పరిధి నుంచి తప్పించాలంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్నీ నిలదీసింది.



కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏపీఏటీలో అపరిష్కృతంగా ఉన్న దాదాపు 8,670 కేసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.ఈ కేసుల గురించి స్పష్టత తీసుకోకుండానే లేఖ రాసిందే తడవుగా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా ఓ ట్రిబ్యునల్ పరిధి నుంచి మరో రాష్ట్రాన్ని తప్పించినప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేసులను హైకోర్టుకు బదలాయించే విషయంలో అనుసరించిన విధానంపై తగిన అధ్యయనం చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని అటు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఇటు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బి.నారాయణరెడ్డిలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.



ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top