పోలీసుల చిత్రహింసల కేసులో ప్రభుత్వానికి నోటీసులు

పోలీసుల చిత్రహింసల కేసులో ప్రభుత్వానికి నోటీసులు - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుల చిత్రహింసల కారణంగా కన్నారెడ్డి అనే వ్యక్తి కిడ్నీలు దెబ్బతిన్నాయన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల దెబ్బల కారణంగా తన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయని పోలీసులపై చర్యలు తీసుకుని, తనకు పరిహారంగా రూ.2 కోట్లు ఇప్పించాలని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ విచారించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా ఎర్రవల్లి గ్రామస్తుడు కన్నారెడ్డి తన సోదరుడు శంకర్‌రెడ్డితో కలసి మోమిన్‌పేటలో ఎరువుల షాపు ఏర్పాటుకు వ్యవసాయ అధికారిణి నీరజ వద్ద దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.



ఆమె లంచం డిమాండ్‌ చేయడంతో అందుకు నిరాకరించిన వారిద్దరూ ఆమె సంభాషణల్ని ఫోన్‌లో రికార్డు చేశారు. అయితే వారిద్దరూ తనను వేధిస్తున్నారని నీరజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వారిని మోమిన్‌పేట పోలీసులు.. ఆడియో రికార్డును ఫోన్‌ నుంచి డిలీట్‌ చేసి వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో కన్నారెడ్డి 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. ఎస్పీ, సీఐ ఇతర పోలీసులు రఘు, రాజు, వీరాస్వామి, శ్రీనివాస్, వెంకటయ్య, శంకరయ్య, మోమిన్‌పేట ఎస్సై రాజు, నీరజ, ఆమె భర్త వీరభద్రేశ్వరరావులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు విన్నవించారు.  
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top