మంచి ‘రోజ్’లెప్పుడో!

మంచి ‘రోజ్’లెప్పుడో! - Sakshi


ప్రారంభం కాని రోజ్‌గార్డెన్

 

 సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరాన అందమైన ‘రోజా పూల’ లోకాన్ని సృష్టించింది మహా నగరాభివృద్ధి సంస్థ. అయితే.. ఆ సుందర ప్రపంచాన్ని వీక్షించే అవకాశం జనానికి దొరకడం లేదు. నెక్లెస్ రోడ్‌లోని దామోదర సంజీవయ్య పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ గులాబీ నందన వనాన్ని (రోజ్ గార్డెన్) అద్భుతంగా తీర్చిదిద్దింది. వివిధ రంగుల్లో 612 రకాల ‘రోజా’లకు ఇక్కడ చోటు కల్పించారు. దేశవాళీ, హైబ్రీడ్‌లో దాదాపు అన్ని రకాల గులాబీలు ఈ గార్డెన్‌లో కొలువుదీరాయి. ప్రధానంగా హైబ్రీడ్ టీన్, ఫ్లోరిబండాస్, రాంబ్లర్స్, క్రిపర్స్, స్క్రాబ్‌రోజ్స్, మినేజర్స్, గ్రౌండ్ కవర్ రోజెస్, మినీ ఫ్లోరిబండాస్ రకాలుకనువిందు చేస్తున్నాయి. సుమారు 12వేల మొక్కలతో అలరారుతోన్న రోజ్‌గార్డెన్‌లో ఇంజినీరింగ్ అధికారులు అందమైన ల్యాండ్ స్కేప్‌ను తీర్చిదిద్దడం అదనపు హంగుగా మారింది. దీని నిర్మాణం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా అధికారికంగా ప్రారంభించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాయంత్ర వేళల్లో సేదదీరేందుకు సంజీవ య్య పార్కుకు వచ్చే సందర్శకులు రోజ్ గార్డెన్ ఎంట్రీ ప్లాజా వరకు వెళ్లి... లోనికి అనుమతించకపోవడంతో ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు.   

 

ప్రశంసలు...




రాజధాని నగరంలో అద్భుతమైన రోజ్‌గార్డెన్‌ను ఆవిష్కరించిందన్న కీర్తిని హెచ్‌ఎండీఏ దక్కించుకొంది. ‘ఇంటర్నేషనల్ రోజ్ గార్డెన్ సొసైటీ’ ప్రతినిధులు ఇటీవల ఈ గార్డెన్‌ను సందర్శించి హెచ్‌ఎండీఏపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశంలోనే ఇదో ‘బెస్ట్ గార్డెన్’గా ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ల్యాండ్ స్కేప్ పార్కుకు అదనపు హంగును అద్దిందని కొనియాడారు. ఈ గార్డెన్‌లో అందమైన గులాబీలతో పాటు వాటర్ ఫాల్స్, ఫౌంటెన్లు, శిల్పాలు, వాక్ వేలు వంటివి మరింత శోభను తీసుకొస్తున్నాయి.

 

ప్రారంభానికి సిద్ధం



 ‘రోజ్ గార్డెన్ ప్రాంభించేందుకు అన్ని ఏర్పాటు చేశాం. మొక్కదశలో పూలు రానందున ఎలా ప్రారంభించాలన్న మీమాంస తలెత్తింది. దీంతో ప్రారంభోత్సవాన్ని కొద్దికాలం వాయిదా వేశాం. ఇప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పూర్తిస్థాయిలో పూలు ఉన్నాయి.త్వరలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నాం. అధికారికంగా ప్రారంభించాకే సందర్శకులను అనుమతిస్తాం.

  - వి.కృష్ణ, బుద్ధపూర్ణిమ ఓఎస్‌డీ

 

 భవితవ్యం ఏమిటి?



 ఆకాశహర్మ్యాలతో హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో గల 96 ఎకరాల విస్తీర్ణంలోనూ అద్భుతమైన నిర్మాణాలకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... ఇప్పటికే రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రోజ్‌గార్డెన్ (గులాబీ తోట) భవితవ్యం ఏమిటన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నిర్మాణం పూర్తయి 6నెలలు గడిచినా ఇంతవరకు అధికారికంగా ప్రారంభించకపోవడం సందేహాలకు తావిస్తోంది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top