జలయజ్ఞంతో 20 లక్షల ఎకరాల సాగులోకి

జలయజ్ఞంతో 20 లక్షల ఎకరాల సాగులోకి - Sakshi


మరో 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి

బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొన్న ఆర్థికమంత్రి


 

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పథకం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 3.036 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2013-14 సామాజిక, ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది.

 

శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించిన రోజునే.. సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. ‘‘13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల (26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ఆధునికీకరణ ప్రాజెక్టులు)ను చేపట్టారు. ఇప్పటివరకు 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ప్రాజెక్టులు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. జలయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 19.696 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి కల్పించారు. 3.036 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు’’ అని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.

 

ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ వెల్లడి...

రాష్ట్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో కూడా జలయజ్ఞం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించిన విషయాన్ని వివరించారు. ‘‘2004 నుంచి రూ. 80,620 కోట్ల అంచనా వ్యయంతో 54 భారీ, మధ్య తరహా సాగునీటి పథకాలు చేపట్టారు. అందులో 13 పథకాలు పూర్తయ్యాయి. మరో 14 పథకాలు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. ఈ పథకాల ద్వారా రూ. 19,378 కోట్ల వ్యయంతో 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా 39 పథకాలు పూర్తి కావాల్సి ఉంది. అందులో 11 పథకాల నిర్మాణం చివరి దశలో ఉంది.

 

ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తికానున్నాయి. వీటి ద్వారా 2,03,628 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మరో 35,990 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది’’ అని పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత కేవలం టాకింగ్ పాయింట్స్ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జలయజ్ఞంలో అవినీతి జరిగిందంటూ విమర్శలు గుప్పించిన విషయమూ విదితమే. కానీ.. వాస్తవాలను దాచిపెట్టలేక శ్వేతపత్రంలో కొత్త ఆయకట్టును యథాతథంగా పేర్కొన్నారు. అదే విషయాలను ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ పేర్కొనడం గమనార్హం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top