హామీలే... ఏమీలే

హామీలే... ఏమీలే


- పేరుకే ‘స్వచ్ఛ హైదరాబాద్’ కమిటీలు

- అమలుకు నోచని సిఫారసులు

- ఎక్కడి సమస్యలు అక్కడే

- అన్ని విభాగాలదీ ఒకటే తీరు

సాక్షి, సిటీబ్యూరో:
‘స్వచ్ఛ హైదరాబాద్’తో విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సమస్యలను గుర్తించడం... వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు వెల్లడించింది. కానీ అధిక శాతం సమస్యలది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న తీరే. ప్రభుత్వ పెద్దల హామీలలో అనేకం కాగితాల మీద నుంచి కిందకు దిగలేదు. గతమే నెలలో నిర్వహించిన తొలి విడత ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఫిర్యాదులను, ప్రభుత్వం దృష్టికి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకొని జూన్‌లో అన్ని పార్టీల నేతలతో ‘స్వచ్ఛ కమిటీలను’ నియమించారు.



జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ, విద్యుత్ విభాగాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. సమస్యల పరిష్కారానికి ఇవి కొన్ని సిఫారసులు చేశాయి. వీటికి రూ.200 కోట్లు మంజూరు చేశారు. విభాగాల వారీగా ఎవరేం పనులు చేయాలో నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించి పనులను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో స్వల్పకాలిక పనులు ముందంజలో ఉన్నాయి. మిగతా విభాగాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీ కొంత ముందంజలో ఉందనే చెప్పాలి.

 

సిఫారసులు.. అమలు తీరు

- ఇంటింటి నుంచి చెత్త సేకరణకు అదనంగా వెయ్యి రిక్షాలు కొనుగోలు చేయాలని నిర్ణయం.

- ఇంకా కొనలేదు.

- చెత్త తరలింపునకు 2500 ఆటో టిప్పర్ల కొనుగోలుకు నిర్ణయం.

- పనులు పురోగతిలో ఉన్నాయి. ఆటో టిప్పర్ల ఎంపిక పూర్తయింది. వీటిని డ్రైవర్ కమ్ ఓనర్ తరహాలో లబ్ధిదారులకు అందజేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

- చెత్త తరలించేందుకు పాత వాటి స్థానే కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు నిర్ణయం.

- వీటిపై  కదలిక లేదు.

- చెత్త నుంచి విద్యుత్ తయారీకి నగరానికి నాలుగు వైపులా 4 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం.

- బీబీనగర్ సమీపంలోని ఆర్డీఎఫ్ ప్లాంట్, జవహర్ నగర్ ప్లాంట్‌లను పరిశీలించారు.

- పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని సిఫారసు. మెరుగైన వైద్య సౌకర్యాలు, గృహ సౌకర్యం కల్పించాలని యోచన.

- వేతనాలను రూ.8,500 నుంచి రూ.12,500కు పెంచారు. గృహాల కోసం స్థలాలు అన్వేషిస్తున్నారు. వైద్య సదుపాయంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- జవాబుదారీతనానికి ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలులోకితేవాలని నిర్ణయం.

- ఇందులో భాగంగా హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని ఒక సర్కిల్‌లో ప్రారంభించారు. మిగతా సర్కిళ్లలోనూ త్వరలో చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

- 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ నిషేధానికి నిర్ణయం. ఇందులో భాగంగా ప్లాస్టిక్ పరిశ్రమల తనిఖీకి నిర్ణయం.

- కానీ ఇంతవరకు తనిఖీలు జరగలేదు.

- పీపీపీ విధానంలో డెబ్రిస్ తరలింపునకు నిర్ణయం.

- టెండర్లు పిలిచారు. త్వరలో ఖరారు కానున్నాయి.

- డెబ్రిస్ తరలింపునకు శివార్లలోని మైనింగ్ ప్రదేశాలను గుర్తించాలని నిర్ణయించారు.

- ఎంతవరకొచ్చిందో తెలియదు.

- అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మళ్లీ బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల అమలుకు నిర్ణయం.

- ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీని సూచనల మేరకు చర్యలు తీసుకుంటారు.

- భవన నిర్మాణ అనుమతులకు పారదర్శక విధానాలు అమల్లోకి తేవాలని.. ప్రస్తుత విధానాలను సరళీకరించాలని నిర్ణయించారు.

- ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇంకా అందుబాటులోకి రాలేదు.

- నాలాల ఆధునీకరణ కోసం ఇళ్లు కోల్పోయే వారికి ప్యాకేజీ అందజేయాలని నిర్ణయించారు.

- ప్యాకేజీని ఇంకా ప్రకటించలేదు.

- నాలాల మార్గాల్లో బాటిల్‌నెక్స్ గుర్తించి, సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. ప్రాధాన్యం మేరకు పనులు చేయాలని నిర్ణయించినప్పటికీ.. మొదలు కాలేదు. దీనికి రూ.223 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.

- చెత్త, వ్యర్థాలు వేయకుండా అన్ని మేజర్ నాలాల వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

- పనులు పూర్తి కాలేదు.

- దెబ్బతిన్న రోడ్లన్నీ వెంటనే రీకార్పెట్ చేయాలని సిఫార్సు చేశారు.

- కానీ చాలా ప్రాంతాల్లో రోడ్లు పరమ అధ్వానంగా ఉన్నాయి.

- ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం

- ఏఈఈల నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌నోటిఫికేషన్ జారీ అయింది.

- విద్యుత్ ఖర్చుల తగ్గింపునకు ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

- ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

- ఎస్సార్‌డీపీ ద్వారా రూ.20 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మించాలని సూచన.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top