ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ

ర్యాలీకి వస్తే భవిష్యత్తు ఉండదు: డీసీపీ - Sakshi

నగరంలో బుధవారం నాడు తెలంగాణ జేఏసీ నిర్వహించాలని తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అనుమతి లేని ర్యాలీలలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలలో పాల్గొంటే నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. అలాంటి ర్యాలీలో పాల్గొన్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.


ఇందిరా పార్కు వద్దకు ఎవరినీ రావద్దని కూడా ఆయన చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు, నగరంలోని అందరు కమిషనర్లకు కోర్టు ఆదేశాల గురించి చెప్పామని అన్నారు. ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞానకేంద్రం లేదా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలవైపు రావాలని ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తీసుకొస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, మొత్తం యువకుల్లో నలుగురైదుగురు అసాంఘిక శక్తులు చొరబడినా విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. 
 
కాగా.. రేపు తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్కు సమీపంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మరోవైపు, ఇప్పటికిప్పుడు చెప్పి నాగోలులోని మెట్రో గ్రౌండులో సభ నిర్వహించుకోమంటే ఎలా సాధ్యం అవుతుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించారు. ఇప్పటికే తమపై వ్యక్తిగత దాడులు మొదలయ్యాయని, ఒక్కరోజే 600 మందిని అరెస్టు చేశారంటే ఇక రేపటి నిర్బంధం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top