ఈ నగరానికి ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది? - Sakshi


వైద్యం కాదు.. శస్త్రచికిత్స అవసరం

హైదరాబాద్ జబ్బు వదలాలంటే అంతే..  సీఎం కేసీఆర్ ఆవేదన

కనీస వసతుల కల్పనకు ఆదేశం  సచివాలయంలో అధికారులతో సమీక్ష

అంతకుముందు మోండా మార్కెట్‌లో గల్లీగల్లీ పర్యటన

 


 హైదరాబాద్:  ‘నగర ప్రజలు తమ కనీస అవసరాలైనా తీర్చుకోలేని దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవడం దారుణమ’ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరింత ఘోరంగా తయారవుతుందని.. పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘మహా నగరానికి పట్టిన జబ్బు వదలాలంటే మామూలు వైద్యం సరిపోదు... శస్త్ర చికిత్స చేయాల్సిందేన’ని సీఎం అభిప్రాయపడ్డారు. నగరం రూపురేఖలు మారాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శనివారం ఆయన మోండా మార్కెట్ సందర్శన అనంతరం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అవసరమయ్యే దోబీ ఘాట్లు, శ్మశాన వాటికలు, కూరగాయల మార్కెట్లు, మాంసాహార మార్కెట్లు, టాయ్‌లెట్లు, పుట్‌పాత్‌లు, పార్కింగ్ స్థలాలు నిర్మించాలన్నారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలో ఏయే ప్రభుత్వ శాఖల పరిధిలో ఎంత భూమి ఉందో గుర్తించాలని.. ఖాళీ స్థలాల్లో ఈ అవసరాలను తీర్చే నిర్మాణాలు  చేపట్టాలని ఆదేశించారు. వారసత్వ కట్టడాల విషయంలో ఆచరణాత్మక పద్ధతి అవలంభించాలని చెప్పారు. అంబేద్కర్ నగర్, వెంగళరావు నగర్‌లలో ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో... ఇరుకు గదుల్లో... మురికి కూపాల్లో జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. అక్కడ వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి రెండు మూడు టవర్లు నిర్మించి... 500 కుటుంబాలు నివసించేలా నిర్మాణాలు డిజైన్ చేయాలని సూచించారు.



హుస్సేన్ సాగర్‌ను ఈ వేసవిలో పూర్తిస్థాయిలో శుద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మురుగునీటి కాల్వలు, నాలాలు హుస్సేన్ సాగర్‌లోకి రాకుండా మళ్లించాలన్నారు. నిధులు ఉన్నాయని.. పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. నగర పరిధిలోని అటవీ శాఖ భూములను గుర్తించి  చెట్లు విరివిగా పెంచాలన్నారు. వనస్థలిపురం జింకల పార్కును అభివృద్ధి చేయాలని, స్థానికులతో కమిటీ వేసి దీన్ని పరిరక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, హెచ్‌ఎండీఏ చైర్‌పర్సన్ ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎంపీ జయేష్ రంజన్, అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ బీఎల్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top