కరెంటు బాదుడుకు బ్రేక్

కరెంటు బాదుడుకు బ్రేక్ - Sakshi


చార్జీల పెంపునకు సీఎం ససేమిరా

చివరి క్షణంలో వాయిదా పడిన పెంపు

రూ.1,736 కోట్లకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఈఆర్సీ

 

 

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చివరి క్షణంలో సీఎం కేసీఆర్ వ్యతిరేకించడంతో విద్యుత్ చార్జీల పెంపుపై పీటముడి పడింది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కొత్త టారీఫ్‌ను ప్రకటిస్తే వచ్చేనెల 1 నుంచి చార్జీల పెంపును అమలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సిద్ధమయ్యాయి. చార్జీల పెంపునకు సీఎం ఒప్పుకోకపోవడంతో మరోనెల పాటు వాయిదా పడే పరిస్థితి నెలకొంది.




 నష్టాలు తగ్గించుకోండి..

 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,958 కోట్ల చార్జీల పెంపు కోసం డిస్కంలు కొత్త టారీఫ్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ఈఆర్సీ.. డిస్కంలు ప్రతిపాదించిన కొత్త టారీఫ్ పట్టికను యథాతథంగా అనుమతించింది. అయితే డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక విద్యుత్ డిమాండ్‌లో 500 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను తగ్గించడంతో చార్జీల పెంపుతో ప్రజలపై పడే భారం రూ.1,736 కోట్లకు పరిమితమైంది. సీఎం ఆమోదముద్ర వేస్తే తక్షణమే కొత్త టారీఫ్ ప్రకటించేందుకు ఈఆర్సీ ఎదురుచూస్తోంది. అయితే సీఎం అనుమతించలేదు.


డిస్కంలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నందున చార్జీల పెంపు తప్పదని, సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 1999లో కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతించేది లేదని ఆయన అధికార వర్గాలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం డిస్కంలు 14 శాతం నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా గట్టెక్కాలని సీఎం సూచించినట్లు సమాచారం.




 గృహాలకు మినహాయింపు ?

 మొత్తంగా విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ గృహ వినియోగదారులపై భారం మోపడానికి మరింత విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చార్జీల పెంపు నుంచి గృహ వినియోగదారులకు పూర్తిగా మినహాయించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, వ్యాపార రంగాలపై కొంత మేర చార్జీలను పెంచినా గృహ వినియోగదారులపై భారం వేయొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. గృహ కేటగిరీలో 0-100 యూనిట్ల మధ్య విద్యుత్ వాడకంపై గత పదేళ్లుగా యూనిట్‌కు రూ.1.45 మాత్రమే వసూలు చేస్తున్నారు.


గత 10 ఏళ్లలో బొగ్గు, ఇంధనం, రైల్వే రవాణా చార్జీలు భారీగా పెరగడంతో గృహ వినియోగదారులపై సైతం చార్జీలు పెంచక తప్పదని అధికారులకు సీఎంకు నివేదించారు. సీఎంను ఒప్పించి గృహ వినియోగంపై సైతం చార్జీలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘విద్యుత్ చార్జీల పెంపును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపరుచుకొని నష్టాలను అధిగమించాలని ఆదేశించారు. డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉండడంతో చార్జీలు పెంచకతప్పదని సీఎంకు వివరించాం. సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. చార్జీలు పెంచకపోతే డిస్కంలు ఆర్థికంగా కుప్పకూలుతాయి’’ అని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top