నిజాం నిధి ఎవరిది?

నిజాం నిధి ఎవరిది? - Sakshi


గత 7 దశాబ్దాలుగా హైదరాబాద్ ఫండ్స్ కేసు కొనసాగుతోంది. హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఇంగ్లాండుకు తరలించిన ఒక మిలియన్ పౌండ్ల నిధులు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇంగ్లాండు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ భారత్, పాక్ ల మధ్య వివాదాలతో ఇవి అక్కడి బ్యాంకులోనే ఉండిపోయాయి. నిజాం వారసులు ఈ నిధులన్నీ తమకే చెందుతాయని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు  విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ నిధులకు సంబంధించి ఆధారాల కోసం హైదరాబాద్ను సందర్శించింది. ఏళ్ల  తరబడి కొనసాగుతున్న ఈ వివాదం గురించి పూర్తి వివరాలు మీకోసం......

                       

హైదరాబాద్ రాష్ట్రాన్ని చివరగా పరిపాలించింది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1948 సెప్టెంబర్ 17 వ తేదీన భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యతో నిజాం రాజ్యం(హైదరాబాద్ రాష్ట్రం) భారతదేశంలో విలీనమైంది. అయితే దీనికి సరిగ్గా రెండు రోజుల ముందే(సెప్టెంబర్ 15న) నిజాం రాజ్యం నుంచి ఒక మిలియన్ పౌండ్ల(రూ. 9.29 కోట్లు) నిధులు ఇంగ్లాండులోని వెబ్ మినిస్టర్ బ్యాంకు(రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్)కు తరలించారు. ఈ నిధులను ఇంగ్లాండులో పాకిస్తాన్ హైకమిషనర్ హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లా పేరిట ఉన్న అకౌంటులో డిపాజిట్ చేశారు.  నిజాం ఆర్థిక మంత్రి మోయిన్ నవాజు జంగ్ ఈ నిధులను ఇంగ్లాండుకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. నిజాంకు తెలియకుండానే నవాజు జంగ్ ఈ నిధులను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.



హైదరాబాద్ రాజ్యం.. భారత యూనియన్లో విలీనం తర్వాత ఈ నిధులను తిరిగి ఇవ్వాలని పాక్ హైకమిషనర్ హబిబ్ను నిజాం సంప్రందించాడు. కాని ఫలితం లేకుండా పోయింది. 1956 వరకు ఈ నిధుల కోసం నిజాం ప్రయత్నించాడు. కాని నేటికీ ఈ నిధులు విడుదల కాలేదు. 1967 లో నిజాం మరణాంతరం ఈ నిధులపై ఆయన వారసులు కూడా స్పందించలేదు. ప్రస్తుతం ఇవి ఇంగ్లాండులోని రాయల్ బ్యాంక్ ఆప్ స్కాట్లాండ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువరూ.310కోట్లు.



ఆర్టీఐ కింద కేసు నమోదు...

హైదరాబాద్ ఫండ్స్ కేసులో గత 67 ఏళ్లుగా వివాదం కొనసాగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే 1948లోనే ఇంగ్లాండ్ నుంచి ఈ నిధులన్నీ పాకిస్తాన్ హైకమిషనర్ హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లాకు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాని బదిలీ అయినట్లు  ఎటువంటి ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వివాదం పెరిగిపోతూ వచ్చింది. కోర్టులతో సంబంధం లేకుండా  ఈ వివాదాన్ని  భారత్, పాక్‌లు చర్చించుకోవాలని భారత కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు 2008లో వార్తలొచ్చాయి. అయితే ఈ నిధులకు సంబంధించి 1948, సెప్టెంబర్ 20న డిపాజిట్ వివరాలను అందించాలంటూ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కింద అక్బర్ అలీ ఖాన్ అనే వ్యక్తి న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతూ దరఖాస్తు చేశాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడంతో నిజాం ఆస్తులపై మరాఠా ప్రజలకు హక్కు ఉందనీ, అందులో తమ వాటా ఎంతనేది తేల్చాలని కోరాడు. దీంతో  కేంద్ర సమాచార కమిషన్ భారత్,పాక్‌ల మధ్య వివాదాన్ని వెంటనే తేల్చాలని  విదేశాంగ  మంత్రిత్వ శాఖను ఆదేశించింది.



ఈ నిధులతో పాక్‌కు సంబంధం ఎక్కడిదీ?

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు పాకిస్తాన్కు చెందిన హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లా సన్నిహితంగా ఉండేవాడు. అయితే 1948లో ఇబ్రహీం ఖాన్ బ్రిటన్లో పాకిస్తాన్కు హైకమిషనర్గా పనిచేస్తున్నాడు. అయితే నిజాంకు చెందిన ఒక మిలియన్ పౌండ్ల నిధులను ఇబ్రహీం పేరిట బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ నిధులన్ని నిజాం వద్ద ఆర్థిక మంత్రి మోయిన్ నవాజు జంగ్ స్వయంగా బ్రిటన్కు పంపించాడు. అనంతరం భారత్లో నిజాం రాజ్యం విలీనమైంది. దీంతో నిజాం ఈ నిధులను  తిరిగి ఇవ్వాలని ఇబ్రహీంను ఎన్ని సార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఇబ్రహీం పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కావడంతో ఈ నిధులపై పాక్ తనకూ హక్కులున్నాయని డిమాండ్ చేస్తోంది.

 

ఈ నిధులు మాకే చెందుతాయి: నిజాం వారసులు

భారత్, పాక్‌లకు ఈ నిధులపై ఎటువంటి హక్కు లేదని నిజాం వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ 2016 జూన్  23న ప్రకటించారు. ఇవి నిజాం  వ్యక్తిగత   నిధులనీ, వీటిపై ఇరుదేశాలకూ హక్కులేదని అన్నారు. నిజాంకు 16 మంది కుమారులు, 18 మంది  కుమార్తెలు ఉండేవారు. వీరంత ప్రస్తుతం చనిపోయినప్పటికీ ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు మిగిలారు. కాని వారి వారసులు 120 మంది ఉన్నారు. వీరందరి తరఫున నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా  నజాఫ్ అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. కాగా  నిజాం ఆభరణాలపై 1995లో సుప్రీం కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై సుప్రీం  తీర్పునిస్తూ...నిజాం రాజ్య ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులను వేరుగా చూడాలి. ఈ ఆభరణాలు నిజాం వారసులకు చెందుతాయని తెలిపింది.



ఇంకా కోర్టులోనే వివాదం...

ఈ నిధులని విడుదల చేయాలని ఇంగ్లాండు ప్రభుత్వం మొదటి నుంచి సుముఖంగానే ఉంది. నిధులన్నీ తమకే చెందుతాయంటూ... భారత్, పాక్, నిజాం వారసుల మధ్యే వివాదం కొనసాగుతూ వచ్చింది. 1958 నుంచి పాకిస్తాన్తో భారత్ పలుమార్లు చర్చలు జరిపింది. కాని పాక్ నిధులు తమకే చెందుతాయని పట్టుబట్టింది. చివరగా 2012 జూలై 5న నిధులపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. మరో వైపు నిజాం వారసులు 2004 నుంచి ఈ నిధులపై పూర్తి హక్కు తమకే ఉందంటూ రంగంలోకి దిగారు. నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ దీనిపై ఇంగ్లాండు కోర్టు ఇచ్చే తీర్పుకే కట్టుబడి ఉంటామని ప్రకటించాడు. అయితే 2013 ఏప్రిల్ 3న పాక్ హైకమిషన్ నిధులను విడుదల చేసేలా బ్యాంకుపై చర్యలు తీసుకోవాలంటూ ఇంగ్లాండు కోర్టును ఆశ్రయించాడు. అయితే 2015 జనవరి 16న కోర్టు తీర్పునిస్తూ ‘ పాకిస్తాన్ కోర్టును దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు నిధులను విడుదల చేయడానికి సిద్దంగానే ఉంది. కాని నిధులు ఎవరికి చెందుతాయనే సందిగ్దంలోనే నిలిపివేసింది. అనవసరంగా బ్యాంకుపై చర్య తీసుకోవాలని పాక్ ప్రయత్నించడం సరైంది కాదు.’ అని వెల్లడించింది.



తెలంగాణకూ హక్కుంది....

హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉన్నందును తెలంగాణాకూ ఈ నిధులపై హక్కు ఉందని విదేశాంగ అధికారులు ప్రకటించారు. నిధులకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు వీరు హైదరాబాద్ను మూడుసార్లు సందర్శించారు. ఇటీవల విదేశాంగ అధికారులు తార్నాకాలోని ఆర్కైవ్స్లో వీటికి సంబంధించిన ఆధారాల కోసం శోధించారు. కాని ఏ ఆధారాలు లభ్యమవ్వలేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top