'ఈ దారుణానికి అక్కే కారణం'

పాఠశాల సిబ్బందిని విచారిస్తున్న ఎమ్మెల్యే గాంధీ. చిత్రంలో డిప్యూటీ డీఈఓ ఉషారాణి - Sakshi


మాదాపూర్: మాదాపూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక(14) బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఘటనలో ఆమె అక్క అరుణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక అక్క అరుణే ఈ దారుణానికి కారణమని మాదాపూర్ ఎస్‌ఐ అక్రమ్‌బాబా తెలిపారు. అరుణ వ్యసనాలకు బానిసై, డబ్బు కోసం తన చెల్లితో ఇలాంటి తప్పుడు పనులను చేయించినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. అందుకు అరుణపై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. అరుణ ఇచ్చిన అలుసుతోనే ధనుష్ అనే వ్యక్తి బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.



ఈ ఉదంతంపై రంగారెడ్డి జిల్లా డీఈఓ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవలింగంను సస్పెండ్ చేశారు. ఏడుగురు ఉపాధ్యాయులకు మెమోలు జారీచేశారు. ఆయన సోమవారం పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ విషయంలో పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. మహిళా టీచర్లు ఇంతమంది ఉండి కూడా బాలిక గర్భం ధరించిన విషయాన్ని కనిపెట్టలేకపోవడం ఏంటని డిప్యూటీ డీఈఓ ఉషారాణి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాఠశాలను సందర్శించారు. బాలిక ప్రసవం ఘటనపై విద్యార్థులను, ఉపాధ్యాయులను విచారించారు. సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. కాగా ప్రసవించిన బాలికను మాదాపూర్ పోలీసులు పాఠశాలకు రప్పించారు. అయితే బాలిక ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతోంది. తన గర్భానికి కారకులెవరో వెల్లడించలేదు.



సుమోటోగా కేసు స్వీకరణ...

మాదాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక బడిలోనే పాపకు జన్మనిచ్చిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక ఘటనకు సంబంధించి పూర్వపరాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top