నైటింగేల్ ఆఫ్ ఇండియా

నైటింగేల్ ఆఫ్ ఇండియా


హైదరాబాదీ సరోజినీ నాయుడు

 

ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, రాజకీయ నాయకురాలిగా ఆధునిక భారతదేశ చరిత్రలో ఆమెది చెరగని ముద్ర. దేశంలోనే తొలి మహిళా గవర్నర్ ఆమె. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ మహిళ కూడా ఆమే. హైదరాబాద్‌లో పుట్టి     పెరిగిన సరోజినీ నాయుడు ప్రస్తావన లేకుండా భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర చెప్పుకోవడం అసాధ్యం. ఆమె తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ నుంచి డీఎస్సీ పూర్తి చేసుకున్నాక, స్వదేశానికి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్ కాలేజీని స్థాపించారు. అది కాలక్రమంలో నిజాం కాలేజీగా మారింది. అఘోరనాథ ఛటోపాధ్యాయ, బరదాసుందరీ దేవి దంపతులకు 1879, ఫిబ్రవరి 13న జన్మించిన సరోజిని బాల్యం నుంచే కవిత్వ రచనలో ప్రతిభా పాటవాలు చూపేది. తొలినాళ్లలో మాతృభాష బెంగాలీలో కవితలు రాసేది. అఘోరనాథ, బరదాసుందరి దంపతుల ఎనిమిది మంది సంతానంలో పెద్దదైన సరోజిని చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలూ కనపరచేది. నిజానికి సరోజినిని తన మాదిరిగానే శాస్త్రవేత్తగా తయారు చేయాలని తండ్రి అఘోరనాథ భావించారు. అయితే, సాహిత్యాభిలాషతో ఆమె కవిత్వం వైపు మళ్లింది. బాల్యంలోనే ‘ది లేడీ ఆఫ్ ది లేక్’ పేరిట పదమూడువందల పంక్తుల దీర్ఘకవిత రాసి తండ్రిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక అప్పటి నుంచి అఘోరనాథ ఆమె కవిత్వాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. మద్రాసు వర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాక నాలుగేళ్ల పాటు ఆమె చదువుకు విరామం ఏర్పడింది. తర్వాత నిజాం స్కాలర్‌షిప్ సాయంతో 1895లో ఇంగ్లండ్ వెళ్లి, లండన్‌లోని కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జిలోని గిర్టన్ కాలేజీలలో చదువుకుంది. అక్కడ పరిచయమైన డాక్టర్ గోవిందరాజులు నాయుడును ప్రేమించి, పెళ్లాడింది.



డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్



రాజకీయాల్లో సరోజినీ నాయుడు కలల స్వాప్నికురాలు. నాటి కాంగ్రెస్ నేత సీపీ రామస్వామి అయ్యర్ ఆమెను ‘డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్’గా అభివర్ణించారు. బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్, మహ్మద్ అలీ జిన్నా, అనీబిసెంట్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారితో కలసి పనిచేశారు. లౌకికవాది అయిన సరోజినీదేవి దేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం పాటుపడ్డారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. బీహార్‌లోని చంపారన్ నీలిమందు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించారు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. 1925లో జరిగిన కాన్పూర్ సదస్సులో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక, దేశంలో ఐదేళ్లలోనే హిందూ ముస్లింల ఐక్యత నెలకొంటుందని కలగన్నారు. అయితే, ఆమె కల నెరవేరకపోవడమే విషాదం.



 గోల్డెన్ త్రెషోల్డ్



సరోజినీ నాయుడు కవితా సంపుటాల్లో ఒకటి ‘గోల్డెన్ త్రెషోల్డ్’. అబిడ్స్‌లోని ఆమె నివాసం పేరు కూడా ఇదే. ఇప్పటికీ అది సాంస్కృతిక కేంద్రంగా వర్థిల్లుతోంది. ‘ది బర్డ్ ఆఫ్ టైమ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’ పేరిట మరో రెండు కవితా సంపుటాలనూ సరోజిని వెలుగులోకి తెచ్చారు. ఆమె కవితల్లో కొన్ని పాటలుగానూ ప్రసిద్ధి పొందాయి. ఒకవైపు స్వాతంత్య్రోద్యమంలో, కాంగ్రెస్ రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నా, ఆమె ఏనాడూ కవిత్వానికి దూరం కాలేదు. బెంగాలీ కవితలు రాస్తున్న బాల్యదశలోనే ఆమె తన తండ్రి సహాయంతో ‘మాహెర్ మునీర్’ అనే పర్షియన్ నాటకాన్ని రాసింది. ఆ నాటకం ప్రతిని చూసిన ఆరో నిజాం సరోజిని ప్రతిభకు ముగ్ధుడై, ఇంగ్లండ్ వెళ్లేందుకు ఆమెకు స్కాలర్‌షిప్ మంజూరు చేశారు. స్వాతంత్య్రానంతరం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సరోజిని, పదవిలో ఉండగానే 1949, మార్చి 2న లక్నోలో తుదిశ్వాస విడిచింది.

 



 

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top