పీజీ వైద్య సీట్లకూ నీట్

పీజీ వైద్య సీట్లకూ నీట్ - Sakshi


వచ్చే ఏడాది నుంచి అమలు: ఎంసీఐ

 

 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారానే రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీ జరగనుంది. సుప్రీంకోర్టు అన్ని వైద్య సీట్లకు నీట్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో పీజీ వైద్య సీట్లను కూడా నీట్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. పీజీ వైద్య సీట్లకు నీట్ తప్పనిసరి చేసినా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులను విద్యార్థులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు కాబట్టి నీట్‌కు భాష సమస్య తలెత్తదు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ సిలబస్ ఆధారంగానే ప్రవేశ పరీక్ష ఉంటుంది కాబట్టి విద్యార్థులకు సిలబస్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ ఉండదంటున్నారు. పైగా దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు పోటీ పడొచ్చని చెబుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు పీజీ మెడికల్ కోసం, బీడీఎస్ పూర్తి చేసినవారు డెంటల్ పీజీకి వేర్వేరు నీట్ ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.



 అక్రమాలకు చెక్

 రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 1,619 పీజీ వైద్య సీట్లున్నాయి. 180 వరకు పీజీ డెంటల్ సీట్లున్నాయి. రాష్ట్రంలో 3 ప్రభుత్వ మెడికల్ పీజీ కాలేజీలుండగా... వాటిల్లో 827 సీట్లున్నాయి. 8 ప్రైవేటు కాలేజీలుండగా.. వాటిల్లో 572 పీజీ వైద్య సీట్లున్నాయి. మైనారిటీ కాలేజీల్లో 220 పీజీ వైద్య సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 827 సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 286 కన్వీనర్ కోటా సీట్లను ఇప్పటివరకు పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసేవారు. ప్రైవేటులోని మేనేజ్‌మెంట్ కోటాకు చెందిన 286 సీట్లను ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రైవేటు యాజమాన్యాలు తమ ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. మైనారిటీ కాలేజీల్లోని 220 పీజీ వైద్య సీట్లది ఇదే పరిస్థితి. ఇవిగాక డెంటల్ పీజీ సీట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 200 వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వీటన్నింటినీ నీట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉంటుంది.



 అన్ని రాష్ట్రాల  పరీక్షలు రాయనక్కర్లేదు..

 నీట్ పరీక్ష అనంతరం రాష్ట్రానికి ర్యాంకులు కేటాయిస్తారు. ఆ ర్యాంకుల ఆధారంగానే ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్, మేనేజ్‌మెంట్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యార్థులు దేశంలో వివిధ ప్రైవేటు మేనేజ్‌మెంట్ సీట్లలో అడ్మిషన్లకు అనేక ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ఈ మొత్తం పరీక్షల ఫీజుల ఖర్చే రూ.లక్ష దాటుతోంది. ఇకపై అలా కాకుండా నీట్ రాసి.. అన్ని రాష్ట్రాల్లోని సీట్లకూ పోటీ పడొచ్చు. అంతేకాదు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ పీజీ వైద్య సీట్లను యాజమాన్యాలు రూ.2 కోట్ల వరకూ అమ్మేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితికి కూడా చెక్ పడనుంది. ర్యాంకుల ఆధారంగా సీటు పొందడమే కాకుండా... ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

 

 నవంబర్-డిసెంబర్ మధ్య పీజీ నీట్

 ప్రతీ ఏడాది పీజీ వైద్య నీట్ పరీక్ష నవంబర్-డిసెంబర్ మధ్య ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియ అక్టోబర్ నుంచే మొదలవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఎంబీబీఎస్ హౌస్‌సర్జన్ పూర్తి చేయబోయే వారు ముందుగా జరిగే నీట్ రాయల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే పీజీ వైద్య పరీక్ష ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేవారు. అంటే దాదాపు రెండు నెలలు ముందుగానే నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుందన్నమాట!

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top