‘సోనా’ దూరమే!

‘సోనా’ దూరమే!


సన్న బియ్యం ధరలు పైపైకి {పత్యేక కేంద్రాలు మూత

రైతు బజార్ల బియ్యమే దిక్కు

శివార్లలో బియ్యం అక్రమ నిల్వలు

తనిఖీల ఊసెత్తని అధికారులు


 

జంటనగరాల్లో సన్నాలకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. శివార్లలోని గోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఆకాశాన్నంటుతున్న ధరలను సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోనా మసూరి బియ్యం కిలో రూ. 30కే అందిచాలని నిర్ణయించింది. నెలకు పది కేజీల చొప్పున సరఫరా చేసేందుకు ప్రత్యేక పంపిణీ కేం ద్రాలను ప్రారంభించింది పౌరసరఫరాల శాఖ. ఐదు నెలల కిందట ఆర్భాటంగా ప్రారంభమైన ఈ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో అవి పత్తాలేకుండా పో యాయి. దీంతో సోనాబియ్యం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. - సాక్షి, సిటీబ్యూరో

 

బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతుండడంతో ఐదు మాసాల క్రితం ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరా శాఖ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించింది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా పరిధిలోని రైస్ మిల్లులు, రైస్ షాఫులు, కిరాణ దుకాణాలు, రైతు బజార్లలో మొత్తం 76 ప్రత్యేక బియ్యం కౌంటర్లను ప్రారంభించింది. ఈ కౌంటర్ల ద్వారా సోనామసూరి బియ్యం కిలో ఒక్కంటికి రూ. 30 చొప్పున ప్రతి కుటుంబానికి పది కేజీల వరకు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. రోజూ ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు కౌంటర్ల పనిచేయాలి. వీటిని అట్టహాసంగా ప్రారంభించినా తర్వాత అధికారులు పట్టించుకోలేదు. ప్రచారం సైతం లేకపోవడంతో ఇవి సామాన్య ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. పర్యవేక్షణలేమితో ప్రత్యేక కేంద్రాలూ మూతపడ్డాయి. ఫలితంగా రైతు బజారుల్లో లభ్యమయ్యే తక్కువ రకం బియ్యమే దిక్కయ్యాయి.



ధరలకు రెక్కలు..



ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సోనామసూరి, కర్నూలు రకం తదితర సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌లో మేలురకం సోనామసూరి బియ్యం కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. ఎగువ, దిగువ మధ్యతరగతి కుటుంటాలకు సన్నరకం బియ్యం అందనంటున్నాయి. దీంతో ఈరకం బియ్యం జోలికి వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా నుంచి జంటనగరాలకు రోజూ 40 నుంచి 50 లారీల బియ్యం వస్తుంది. ప్రస్తుతం ఈ సంఖ్య  భారీగా తగ్గింది. జంటనగరాల్లో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారే ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వ పరంగా సరైన నియంత్రణ లేకపోవడంతో వీటి ధరలు రోజురోజుకు మరింత  ఎగబాకుతున్నాయి.

 

నియంత్రణ కరువు



 ధరల నియంత్రణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇటు హైదరాబాద్, అటు రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాలశాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. నగర శివారుల్లోని కొన్ని గోదాముల్లో టన్నుల కొద్దీ అక్రమ నిల్వలు ఉంచినట్టు అధికారవర్గాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దాడులకు ఉపక్రమిస్తే భారీస్థాయిలోనే అక్రమ నిల్వలు వెలుగుచూసే అవకాశాలున్నా.. అధికారుల్లో మాత్రం చిత్తశుద్ధి కరువైంది. కొంతకాలంగా తనిఖీల ఊసేలేకుండా పోయింది.

 

శాశ్వత కౌంటర్ల జాడేది..?

 

2009లో బియ్యం ధరలను నియంత్రించేందుకు అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం కేంద్రాలు నిస్తేజంగా మారాయి. బహిరంగ మార్కెట్లో సూపర్‌ఫైన్ బియ్యం అప్పట్లో రూ. 32 దాటడంతో స్పందించిన వైఎస్ సర్కారు నగరంలో 200 ప్రత్యేక బియ్యం కేంద్రాలను తెరిచింది. తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి పదేసి కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేసింది. కేజీ రూ. 20లకు సూపర్‌ఫైన్ బియ్యాన్ని వినియోగదారులు రైతుబజార్లలో క్యూలు కట్టి మరీ కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం.. పౌరసరఫరాల శాఖ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో లక్ష్యం దెబ్బతింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ధర ల నియంత్రణకు  ప్రత్యేక బియ్యం కౌంటర్లు  ఏర్పాటు చేసిన కనీస పర్యవేక్షణ లేక కనుమరుగయ్యాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top