'అక్కడ ట్రంప్ లాగే ఇక్కడ మోదీ, కేసీఆర్'

'అక్కడ ట్రంప్ లాగే ఇక్కడ మోదీ, కేసీఆర్' - Sakshi

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతాన్ని రెచ్చగొడుతున్నారని, మొత్తం రాజకీయ వాతావరణాన్నే కలుషితం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. అమెరికాలో ట్రంప్‌లాగే ఇక్కడ మన దేశంలో మోదీ, కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుల మాటలు చాలా ప్రభావం చూపుతాయని.. ట్రంప్ మాటల వల్ల అమెరికాలో మన వాళ్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అక్కడ గన్ కల్చర్ బాగా పెచ్చు మీరుతోందని, దానిపై ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి కవచం అన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు సరికాదని, సెక్యులరిజం  హంతకముఠాకు అధ్యక్షుడు వెంకయ్యనాయుడని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని నారాయణ హెచ్చరించారు. 

 

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, ఆయనకు సురవరం సుధాకర్ రెడ్డే కలలోకి వస్తున్నట్లున్నారని అన్నారు. తిరుమల వేంకటేశ్వరునికి రూ. 5 కోట్లతో నగలు చేయించానంటున్న కేసీఆర్.. అదేదో తన అబ్బ సొత్తులాగ తీసుకెళ్లారని సీపీఐ నారాయణ విమర్శించారు. ఆయన అబ్బ సొత్తు ఉంటే దేవుడికి నగలు చేయించుకోవచ్చు, ఆయన కుటుంబ సభ్యులంతా వెళ్లి గుండు కొట్టించుకోవచ్చని అన్నారు. సొంతంగా మీసాలు లేని కేసీఆర్.. మరో దేవుడికి మీసాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులతో కేసీఆర్ దోస్తానా చేస్తున్నాడని.. కేబినెట్లో తెలంగాణ వ్యతిరేకులతో కూర్చుని నిర్ణయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కమ్యూనిస్టులు మంచివాళ్లని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం శత్రువుల్లా చూస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందనడం సరికాదని, ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను ఊరవతలికి తరలిస్తే.. తాము వెళ్లడం కాదు, ఆయనను కూడా ఊరు బయటికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top