మన 'ఐటీఐ'లు నెంబర్ వన్ కావాలి: నాయిని


హైదరాబాద్: దేశంలో ఉన్న ఐటీఐలకంటే మన రాష్ట్రంలోని ఐటీఐలే నం-1 కావాలని, ఆ విధంగా ఐటీఐలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్‌పై ఉందని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిఅన్నారు. యూసఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైసెస్ (ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ)లో సోమవారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల ప్రిన్సిపల్స్‌తో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐలు 60, ప్రైవేట్ ఐటీఐలు 210 ఉన్నాయని, ఏటా 40వేల మంది విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐల్లో చేరుతున్నారన్నారు.



కొన్ని ప్రభుత్వ ఐటీఐలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, అలాంటి వాటిని ప్రభుత్వ స్థలాల్లో సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఐటీఐలలో ఎక్కువగా ఖాళీ స్థలాలు ఉన్నాయని, అలాంటి వాటిల్లో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడతామన్నారు. తద్వారా ఆర్థిక వనరులు పెరుగుతాయని, ఆ వచ్చే మొత్తాన్ని ఐటీఐల నిర్వహణకే కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఏఏ కోర్సులు అవసరమో అలాంటి కోర్సులనే ఐటీఐల్లో నేర్పిస్తే కోర్సు పూర్తి అయిన వెంటనే ఉపాధి దొరికే అవకాశం ఉంటుందన్నారు. ఐటీఐ పూర్తి చేసిన 80 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయన్నారు.



నగరంలోని మల్లేపల్లి ఐటీఐని మోడల్ ఐటీఐగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేసిందని, మన రాష్ట్రంలో కూడా జిల్లాకు ఒకటి చొప్పున మోడల్ ఐటీఐగా మార్చడానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఆర్థిక సాయం అడిగామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో ఐటీఐలలో అప్‌డేట్ మిషనరీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్మిక శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, డెరైక్టర్ నాయక్, డిప్యూటీ డెరైక్ట్ ధర్మరాజ్ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్‌కు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top