సైక్లింగ్

సైక్లింగ్


ఖరీదైన బైకుల మీద దూసుకెళ్లే యూత్ ఉన్న ఈ కాలంలో ఓ కుర్రాడు సైకిల్  సవారీకే ‘సై’ కొట్డాడు.. పేదరికంలో పుట్టినా పట్టుదలతో తన లక్ష్యం వైపు దూసుకెళ్తున్నాడు. ఎత్తైన కొండను సైకిల్‌తో ఎక్కేసి జాతి పతాకాన్ని ఎగరేస్తున్నాడు... మరిన్ని రికార్డులు తొక్కేసేందుకు సిద్ధమవుతున్న నాగరాజు తన సైకిల్ ప్రస్థానాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకున్నాడు...

 

సైకిల్‌పై నా వ్యామోహం ఇప్పటిదికాదు.. చిన్నప్పుడే దానితో ప్రేమలో పడిపోయా. ఎవరిదైనా సైకిల్ దొరికితే ఊరంతా చుట్టేయాల్సిందే. నాన్నకు ఈ విషయం తెలిసి ఓ సెకండ్‌హ్యాండ్ సైకిల్‌ను కొనిచ్చారు. అప్పటి నుంచి అదే నా లోకం. నా సైకిల్ సవారీకి హైదరాబాద్ కూడా చిన్నదైపోయింది. ట్యాంక్‌బండ్ నుంచి చార్మినార్ వరకు.. నెక్లెస్‌రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఇలా సిటీలో అన్నీ చుట్టేశా.  ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. అమ్మ పదిళ్లలో పాచిపని చేస్తే... నాన్న రోజూ కూలీకి వెళితే కానీ మా ఇంట్లో పొయ్యి వెలగదు. వరంగల్ జిల్లాలోని తరిగొప్పుల అనే చిన్న గ్రామం మాది.  

 

ఆమే స్ఫూర్తి..

ఒక రోజు సైకిల్ మీద సికింద్రాబాద్ వెళ్తుంటే జింఖానా గ్రౌండ్‌లో దినాజ్ 24 గంటల ఎరోబిక్స్ షో జరుగుతోంది. అది పెద్ద రికార్డ్ అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు నాకు కూడా సైకిల్‌తో రికార్డు సృష్టించాలనే ఆలోచన వచ్చింది. అలా అనుకున్నదే తడవుగా ట్యాంక్‌బండ్ నుంచి  నెక్లెస్‌రోడ్ వరకు 24 గంటలు నాన్‌స్టాప్‌గా సైకిల్ తొక్కా. అప్పుడు నా ఫ్రెండ్స్ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది.

 

ఆదిత్య చేయూత..

నా సైకిల్ సవారీలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఆదిత్య మెహతా. ఒక కాలు లేకపోయినా సైకిల్ యాత్రలు చేస్తూ రికార్డులు సృష్టించాడు. నగరంలో సైక్లింగ్ పోటీలు జరిగితే రైడింగ్ సైకిల్ కొనుక్కునే డబ్బులేక అద్దెకు సైకిల్ తీసుకుని పాల్గొనే నాకు అన్నివిధాలుగా చేయూతనిచ్చాడు. తనతో కలిసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేశా.

 

కొండ కూడా తలవంచింది..

ప్రపంచంలో ఎత్తైన కొండపై సైకిల్‌యాత్ర చేయాలన్నది నా లక్ష్యం. ఇందుకు అవసరమైన మౌంటెన్ సైకిల్‌ను ఆదిత్యనే ఇచ్చాడు. ఈసారి నా లక్ష్యానికి అనుగుణంగా పంద్రాగస్టు రోజున జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ జిల్లా కర్దుంగ్లాలో జాతీయపతాకాన్ని ఎగురవేయాలని ప్లాన్ చేసుకున్నాం. పదిరోజుల ముందే కులు-మనాలి చేరుకున్నాం. అక్కడి నుంచే మా జర్నీ మొదలైంది. విపరీతమైన చలి, ఆక్సిజన్ లేకపోవడంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. పెద్దపెద్ద రాళ్లను దాటుకుంటూ వెళ్లే ప్రయత్నంలో ఎన్నో గాయాలయ్యాయి. అయినా నా ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ చిన్నవిగానే అనిపించాయి. చివరకు అనుకున్నట్లుగానే ఆగస్టు 15న కర్దుగ్లాకు చేరుకున్నాం. అక్కడ నా చేతితో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు.. సరికొత్త రికార్డునూ సృష్టించాం.

 

రికార్డు తొక్కేస్తా...

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌పాండే 86.45 గంటల పాటు సైకిల్ తొక్కి 1,038 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. దీన్ని బద్దలు కొట్టాలన్నది నా లక్ష్యాల్లో మరొకటి. 100 గంటల్లో 1,300 కిలోమీటర్లు నిరాటంకంగా సైకిల్ యాత్రచేసి కొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటున్నా. కానీ, ఇలాంటి రికార్డులు సృష్టించాలంటే బాగా ప్రాక్టీసు చేయాలి. అందు కోసం  బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. దానికోసం ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే కొన్ని ఈవెంట్లలో స్టేజీ డెకరేషన్ బాయ్‌గా పనిచేస్తున్నా. నా లక్ష్యం చేరాలంటే నా దగ్గరున్న పాత సైకిల్‌తో అది సాధ్యం కాదు. ఇందుకోసం అత్యంత ఖరీదైన రోడ్ బైక్ సైకిల్ కొనుక్కోవాలి. ఇందుకోసం సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందుకే ఎవరైనా దాతలు స్పందిస్తారేమోనని చూస్తున్నా..

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top