సూక్ష్మసేద్యానికి రుణంపై నాబార్డు కొర్రీలు


 రూ. వెయ్యి కోట్ల అప్పుపై సర్కారు హామీనీ పట్టించుకోని సంస్థ

 ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం రాయితీ వద్దని మెలిక

 25 శాతం రైతులు చెల్లించాల్సిందేనని పట్టు

 అలాగైతేనే పథకానికి రుణం ఇస్తామని కుండబద్దలు


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం పథకం అమలుకు ప్రభుత్వం అడిగిన రూ. వెయ్యి కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డు కొర్రీలు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థకు ఇచ్చే రుణంపై పూచీకత్తు ఇస్తామని సర్కారు హామీ ఇచ్చినా మార్గదర్శకాల పేరిట సాకులు చెబుతోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నూరు శాతం రాయితీ (బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ)ని 75 శాతానికి పరిమితం చేస్తేనే రుణం మంజూరు చేస్తామని మెలిక పెడుతోంది. ఈ అంశంపై ఉద్యానశాఖ అధికారులు మూడుసార్లు చేపట్టిన సమావేశాల్లోనూ నాబార్డు అధికారులు ఇదే వాదనను తెరపైకి తెచ్చారు. లబ్ధిదారులకు నూటికి నూరు శాతం సబ్సిడీ సరైంది కాదని... ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ మాత్రమే ఇవ్వాలని, మిగిలిన 25 శాతాన్ని రైతులు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని వారు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు క చ్చితమైన మార్గదర్శకాలున్నాయని... కాబట్టి నూటికి నూరు శాతం సబ్సిడీకి అంగీకరించబోమని చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ వ్యవహారం సీఎం వద్దకు వెళ్లినట్లు సమాచారం. ‘‘సబ్సిడీ ఎంతివ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఈ విషయంలో నాబార్డు జోక్యం సరైంది కాదు. వారిచ్చే రుణానికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. నిర్ణీత సమయంలో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత ప్రభుత్వానిది’’ అని ఉద్యానాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

 

 ఈ ఏడాది 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం...

 రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సూక్ష్మసేద్యంతో తక్కువ నీటితో పంటలు పండించేలా చేయాలని భావించింది. గత రెండేళ్లలో 1.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేయగా... 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఈ పథకం కింద కేవలం 75 శాతమే రాయితీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకం కింద గతేడాది నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఇస్తోంది.


ఇందుకోసం ఈ ఏడాది రూ. 290 కోట్లు కేటాయించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 190 కోట్లు కేటాయించగా... కేంద్రం తన వాటాగా రూ. 100 కోట్లు ఇవ్వనుంది. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని అందుకునేందుకు ఈ సొమ్ము సరిపోదని... అందువల్ల నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రం నిర్ణయించింది. నేరుగా రుణం తీసుకోవడానికి సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా రుణం తీసుకొని ఉద్యానశాఖ పరిధిలోని సూక్ష్మసేద్యానికి మరలించాలని నిర్ణయించింది.

 

 దుర్వినియోగం అవుతుందనేనా?

 లబ్ధిదారులకు నూరు శాతం సబ్సిడీ ఇస్తే సూక్ష్మసేద్యం పథకం దుర్వినియోగం అవుతుందని నాబార్డు అధికారులు చెబుతున్నారు. భారీ రాయితీ ఇస్తుండటంతో కొందరు రైతులు కూడా ఇష్టానుసారంగా తీసుకొని సూక్ష్మసేద్యం పరికరాలను ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. అందువల్ల రైతుల వాటా 25 శాతం ఉంటేనే బాధ్యతగా ఉంటారని పేర్కొంటున్నారు. అందుకే తాము రాష్ట్ర ప్రభుత్వానికి భారీ రాయితీ వద్దని సూచించామని ఒక అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top