మట్టి మహిమ

మట్టి మహిమ


‘మహా’ఉష్ణంతో జనం అల్లాడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎవరికి తెలిసిన రీతిలో వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు. ఇదే క్రమంలో వేసవికాలాన్ని చల్లగా మార్చుకునేందుకు చాలామంది ఒళ్లంతా బురదను పులుముకుని ఎంజయ్ చేస్తున్నారు...కాదు కాదు...ఆరోగ్యం కోసం తాపత్రయపడుతున్నారు. దానిని మృతిక స్నానంగా కూడా పిలుచుకుంటాం. ఒక్కసారి ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శిస్తే...మట్టితో కప్పేసుకుంటున్న దేహాలను  చూడవచ్చు.  మట్టిలోని పరమానందాన్ని ఆస్వాదిస్తుంటారు. మృత్తిక స్నానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ఇది నేటితరం వారికి వింతగా ఉన్నా అందులో దాగి ఉన్న ఆరోగ్యకర ఔషధాలు అందించే ఉపశమనం అంతా ఇంతా కాదని అనుభూతుపరులు చెప్పే మాట. అసలే వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా మడ్‌బాత్‌లో మునిగితేలుతున్నారు. మడ్‌బాత్ చేయించుకునేందుకు రోజురోజుకు ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  - కోట కృష్ణారావు



ఒక చికిత్సలా...



పంచభౌతికమైన శరీరానికి పృద్వీని జోడించి మృత్తిక చికిత్స (మడ్ ట్రీట్‌మెంట్)ను అందిస్తున్నారు. మట్టిని పట్టీలుగా గానీ, రోగగ్రస్థమైన అవయవంపై లేపనంగా గానీ, శరీరం అంతా మృత్తిక లేపనం చేస్తారు. ఈ చికిత్సను రోగిని అనుసరించి గానీ, వాతావరణం, కాలాలను అనుసరించి గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రతను బట్టి మృత్తిక చికిత్సలు అధికంగా ఉంటుందని ప్రకృతి వైద్యులు చెప్పేమాట. ఈ చికిత్సకు జిగురుతత్వాన్ని కలిగిన బంకమన్ను (రేగటి మన్ను)ను ఉపయోగిస్తారు.


 తలమట్టి



తలను నీటితో తడిపిన తరువాత నానిన రేగడిమట్టిని పూస్తారు. 15 నిమిషాల పాటు ఎండలో ఉన్న తరువాత శిరస్నానం చేయాలి. పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ రకమైన తలమట్టి స్నానమాచరించవచ్చు. దీని ద్వారా తల చుండ్రు, జుట్టు ఊడిపోవడం, పండిపోవడం పేలు కొరుకుడు, తలనొప్పి కళ్ల మంటలు, నీరుకారడం, దృష్టి లోపం, కంటి, చెవి, ముక్కు వ్యాధుల నివారణ జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉన్మాదం, హిస్టీరియా, నిద్రలేమి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.


 ఛాతిమట్టి



రోగిని బల్లపై గానీ, నేలపై గానీ పడుకోబెట్టి ఒక ఇంచు మందంతో ఛాతి భాగమంతా మట్టి లేపనం చేస్తారు. దీని ద్వారా ఛాతినొప్పి, మంట, గుండె జబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు.


 అవయవ లేపనాలతో  రుగ్మతలు దూరం...



వైద్యుల సలహాలను అనుసరిస్తూ అవయవ మట్టి లేపనాలను వేసుకోవడం ద్వారా ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేయవచ్చని ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు.


 భూగర్భ స్నానం



తల బయట ఉంచి భూమిలో శరీరం మొత్తాన్ని గానీ, వ్యాధి సోకిన అవయవాన్ని గానీ 10 నుంచి 30 నిమిషాల వరకు ఉంచడమే భూగర్భ స్నానం. దీని ద్వారా పక్షవాతం, పోలియో, కండరవాతం, సంధివాతం, గూని, పోలియో, చర్మవ్యాధులు, కుష్టు, బొల్లి రోగులను భూగర్భ స్నానం చేయించడం ద్వారా ఉపయోగం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పాముకాటుకు ఇది ఉపయోగపడుతుం దట. పాము కరచినప్పుడు రోగిని అడ్డంగా అరగజం లోతు గొయ్యి తవ్వి తల బయటకు ఉంచి మట్టితో కపిప కొన్ని గంటల వరకు ఉంచినట్లయితే పాము విషం హరించబడుతుంది. భూమిలోని అయస్కాంతశక్తితో పాటు సేంద్రీయ లవణాల వల్ల   రోగాలు నయమవుతాయి.


 ఉదరమట్టి



నానిన రేగడిమట్టిని ఇక ఇంచుమందంతో పొట్ట భాగంలో లేపనం చేస్తారు. దీని ద్వారా మలబద్ధకం, జ్వరం, అతి విరేచనాలు, రక్త గ్రహణి, అమీబియాసిస్, ఆంత్రవ్రణములతో బాధపడుతున్న వారికి పొట్టపై మట్టి లేపనం చేస్తే ప్రయోజనం పొందవచ్చు. మూత్రం మంటగా ఉన్నప్పుడు పొత్త కడుపుపై మట్టి గానీ, మట్టీపట్టీలు గానీ వేయడం వల్ల మంట వెంటనే హరించబడుతుందట. మూత్రం రానిచో పొత్తి కడుపును కాపడం చేసి మట్టిపట్టీలు గానీ, మట్టి లేపనం గానీ చేసినట్లయితే సత్ఫలితాలుంటాయి.


 మట్టిపట్టీలతో ఉపయోగాలెన్నో...



 


  •       సహజంగా మట్టిపట్టీని రోగి ఉపవాస కాలంలో రోజుకు రెండుసార్లు (ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు) వేయడం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత మామూలు స్థితికి వస్తుందట.

  •       ఎంతటి తీవ్రమైన జ్వరమైనా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గించే శక్తి మట్టిపట్టీలకు ఉంటుంది. రెండు నుంచి మూడు రోజులు క్రమంగా మట్టిపట్టీని వేస్తే జ్వరం పూర్తిగా నివారింపబడుతుంది.

  •      ప్రేవులలో మండనం (మురుగు) లేకుండా కాపాడుతుంది ఆంత్రవ్రణములు, అమీబియాసిస్, పరిణామాశుల వంటి వ్యాధులకు మట్టీ పట్టీలు రోజుకు రెండు నుంచి మూడుసార్లు వేసుకోవడం ద్వారా కొద్దిరోజులకే తగ్గుతాయట. మందులు వాడాల్సిన అవసరం అసలే ఉండదు.

  •       చీము, రక్త విరేచనాలు, నీళ్ల విరచనాలు ఒకటి రెండు రోజుల్లో నివారించవచ్చు.

  •       రక్త ప్రదరము (ఎర్రబట్ట), శ్వేత బదరం (తెల్లబట్ట) ఉన్న స్త్రీలకు మట్టిపట్టీలు రోజుకు మూడు లేదా నాలుగుసార్లు రెండు గంటల వ్యవధి చొప్పున వేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని వైద్యశాస్త్రం సూచిస్తోంది.

     


 వైద్యుల  పర్యవేక్షణలో చేయాలి



వేసవిలో మడ్‌బాత్‌కు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే మడ్‌బాత్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒంట్లోని ఎన్నో రకాల రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రకృతి వైద్య శాస్త్రం ద్వారా నిరూపితమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సి ఉంటుంది. మంగళ, గురు, శనివారాల్లో మహిళలకు, సోమ, బుధ, శుక్రవారాల్లో పురుషులకు మృత్తిక చికిత్స చేయడం జరుగుతుంది.



-డాక్టర్ ఎంవీ మల్లికార్జున్,  సూపరింటెండెంట్, నేచర్‌క్యూర్ ఆస్పత్రి, అమీర్‌పేట్




Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top