ప్రాజెక్టులపై అవగాహన లేదు : ఎంపీ కవిత

ప్రాజెక్టులపై అవగాహన లేదు : ఎంపీ కవిత - Sakshi

► జానారెడ్డి రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు


రేవంత్‌రెడ్డి.. వర్క్‌లేని వర్కింగ్ ప్రెసిడెంట్ 


►  ప్రతిపక్షాలపై ఎంపీ కవిత  మండిపాటు


 


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహన కూడా లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో కాంగ్రెస్ 152 మీటర్లకు ఒప్పందం చేసుకోలేదని రాజకీయాలకు అతీతంగా మాట్లాడి ప్రతిపక్ష నేత జానారెడ్డి తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారన్నారు. మిగతా కాంగ్రెస్ నేతలు కూడా జానారెడ్డి బాటలో నడిస్తే బావుంటుందని వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ తెలంగాణ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం పెట్టారని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీలు పట్టించుకోలేదని విమర్శించారు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర మధ్య 40-35 టీఎంసీల చొప్పున నీటిని వాడుకునేలా ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, దీంతో ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు అందని దుస్థితి నె లకొందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి అధిష్టానం అమరావతిలో ఉందని, ఆయన వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్ అని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లేదా మరే ఇతర ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తేవాలన్నారు.



 శాస్త్రీయ పద్ధతిలోనే కొత్త జిల్లాలు

కొత్త జిల్లాల విభజనపై విపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, శాస్త్రీయ పద్ధతిలోనే జిల్లాలు ఏర్పడుతున్నాయని కవిత పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జీఎస్టీతో రాష్ట్రానికి లాభం జరుగుతుందని, ఈ బిల్లుకు మొదట  మద్దతు తెలిపింది తెలంగాణేనని చెప్పారు. టీఆర్‌ఎస్ కేంద్రానికి వ్యూహాత్మకంగా మద్దతిస్తోందని పేర్కొన్నారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top