పదేళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు


బంజారాహిల్స్ : తల్లి ఎలా ఉంటుందో ఆ కూతుళ్లకు తెలియదు. చిన్నప్పుడే పిల్లలను వదిలేసిన ఆ తల్లికి.. వాళ్లేంచేస్తున్నారో, ఎలా ఉన్నారో తెలియదు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ తల్లీకూతుళ్లు కలిశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని జహీరానగర్‌లో నివసించే పద్మ, రమేష్ దంపతులకు ఒక కూతురు(6) ఉంది. రోడ్డు ప్రమాదంలో రమేష్ చనిపోగా పద్మ సమీపంలో ఉండే గోవిందు అనే వ్యక్తితో సహజీవనం సాగించింది. దీంతో ఆమె మరో ఆడపిల్లకి  జన్మనిచ్చింది.



పెద్ద కూతురికి ఆరేళ్లు, చిన్న కూతురికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడే మద్యానికి బానిసై పద్మ ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో గోవిందు.. లక్ష్మి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికే లక్ష్మికి ఓ కొడుకు ఉండగా గోవిందుతో పెళ్లి అనంతరం మరో కొడుకు,కూతురు పుట్టారు. ఈ క్రమంలోనే గోవిందు,లక్ష్మిల ప్రవర్తనలో మార్పు వచ్చింది. పద్మ కుమార్తెలపై కోపం పెంచుకుని వారిని హింసించటం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఐదేళ్ల క్రితం పెద్ద కుమార్తెను, ఇటీవలే చిన్న కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు. వారిద్దరూ ఎంతగా ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దీంతో పెద్ద కుమార్తె ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది.



రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న అసలు తల్లి పద్మ శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తన కూతుళ్లను చూసి, వారి పరిస్థితిని తెలుసుకొని కుమిలిపోయింది. తల్లిదండ్రులు లేకుండా నరకాన్ని చవి చూసిన ఆ కూతుళ్లు తల్లిని చూసిన క్షణమే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. చిన్న కూతురిని చదివిస్తానని, పెద్ద కూతురికి వివాహం చేస్తానని పద్మ పోలీసులకు తెలిపింది. తన కూతుళ్లు బాగా చదువుకుంటున్నారని అనుకున్నానని.. తీరా చూస్తే ఇలా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు గోవిందుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top