భారీగా వడపోత

భారీగా వడపోత - Sakshi


89 వేలకు పైగా పింఛను దరఖాస్తుల తిరస్కృతి

వచ్చిన దరఖాస్తులు 2.71 లక్షలు  ఇంకా పరిశీలించాల్సినవి 49వేలు


 

సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ సామాజిక పింఛన్లకు అర్హులుగా 1,32,951 మందిని ఎంపిక చేశారు. అక్టోబర్ నుంచి పెంచిన కొత్త పింఛన్లను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 30లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. నగర, పట్టణ ప్రాంతాల్లోనే పరిశీలన పూర్తి కాకపోవడంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గ్రేటర్ పరిధిలో ఇంకా 49,261కి పైగా పింఛను దరఖాస్తులను పరిశీ లించాల్సి ఉంది. నగరంలో సామాజిక పింఛన్లకు 2,71,837 దరఖాస్తులు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే లింకుతో ఇప్పటి వరకు 2,22,576 పరిశీలించారు. వీటిలో 1,32,951 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. మిగిలిన 89,625 దరఖాస్తులను తిరస్కరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే వాటిని తిరస్కరించినట్లు అధికార వర్గాల వివరణ. వీరందరూ పునః పరిశీలనకు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు పేర్కొంటున్నారు.



లబ్ధిదారుల ఎంపిక 60 శాతమే



సామాజిక పింఛన్లకు ఎంపిక విధానాన్ని పరిశీలిస్తే... నగరంలో 60 శాతానికి మించలేద ని తెలుస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా ల్లో పింఛన్ల పరిస్థితిని చూస్తే... రంగారెడ్డి జిల్లాలోని పట్టణ ప్రాంతంలో పింఛన్లకు 1,33,450 దరఖాస్తులు రాగా, వాటిలో 1,13.456 పరిశీ లించారు. అందులో 68,036 మందిని అర్హులు గా గుర్తించారు. 45,420 దరఖాస్తులను  తిరస్కరించారు. హైదరాబాద్ జిల్లాలో పింఛన్లకు 1,38,387 దరఖాస్తులు అందాయి. వాటిలో 1,09,120 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 64,915 మందిని ఎంపిక చేశారు. మిగిలిన 44,205 దరఖాస్తులు నిబంధనల మేరకు లేవని తిరస్కరించారు.



► ఈ జిల్లాలో వికలాంగుల పింఛన్లకు 22,998 దరఖాస్తులు రాగా, వాటిలో 17,942 పరిశీలించారు. 11,296 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. 6,646 దరఖాస్తులను తిరస్కరించారు.



►     వితంతు పింఛన్లకు 59,265 దరఖాస్తులు అందాయి. 47,505 దరఖాస్తునలు పరిశీలించి... 30,625 అర్హమైనవిగా గుర్తించారు. 16,880 దరఖాస్తులను తిరస్కరించారు.



► వృద్ధాప్య పింఛన్లకు వచ్చిన దరఖాస్తులు 56,124. అధికారులు పరిశీలించినవి 46,673. అర్హమైనవి 22,994. తిరస్కరణకు గురైనవి 23, 679 దరఖాస్తులు.

 

గ్రేటర్‌లో సర్వేకు కష్టాలు

 

నగరంలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి స్థాయిలో కాకపోవటంతో పింఛను దరఖాస్తుల పరిశీలన జాప్యమవుతోంది. ఈ దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగిస్తూనే... వాటిని పరిశీలించడం సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. దరఖాస్తుల ఆధారంగా ఇప్పటి వరకు 50 వేలకు పైగా కుటుంబాలలో సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు ఉపాధ్యాయులు సెలవు దినాలను సైతం లెక్క చేయకుండా సహకరించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్కిళ్ల వారీగా సమగ్ర సర్వే సాఫ్ట్‌వేర్ వివరాలను మండల యూనిట్‌గా అనుసంధానం చేసుకుని దరఖాస్తులు పరిశీలించారు. అయినప్పటికీ గ్రేటర్‌లో ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు 49,261 ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లావి 29,261 ఉన్నాయి.

 

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top