అంతులేని ప్రలోభాలు

అంతులేని ప్రలోభాలు - Sakshi


- ఫిరాయింపులకు తెలంగాణ, ఏపీ అధికార పక్షాల ప్రోత్సాహం

టీడీపీ, టీఆర్‌ఎస్‌ల తీరుపై ఆందోళన

ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనంటున్న రాజకీయ విశ్లేషకులు

దిగజారుడు రాజకీయాలు మంచివి కావనే అభిప్రాయాలు

పార్టీని వీడేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన కారణాలపై ఆశ్చర్యం


 

సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం, నయానో భయానో లొంగదీసుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ అక్కడి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రికార్డు స్థాయిలో బేరాలకు దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేస్తోంది. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయాందోళనకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

 తాజాగా వైఎస్సార్‌సీపీ ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన తీరు చూసి రాజకీయ పరిశీలకులే నివ్వెరపోతున్నారు. ఓ రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఉన్నపళంగా పార్టీ ఫిరాయించడం చూసి విస్తుపోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష పార్టీల చట్టసభ సభ్యులను ప్రలోభపెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని... దేశంలో ఎక్కడా ఇంత దిగజారుడు రాజకీయా లు లేవని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

 

 అవసరం లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని పరి హాసం చేస్తోందన్నారు. ఇక పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన కారణాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తానని ప్రకటించినందుకే తాను పార్టీ వీడుతున్నానని చెప్పిన మాటలు విస్తుగొలిపే రీతిలో ఉన్నాయంటున్నారు.



‘పాలమూరు’ కారణంగా పొంగులేటి ప్రాతినిధ్యం వహించే ఖమ్మం జిల్లాకు కూడా నీరు అందక ఇబ్బంది ఏర్పడుతుందని జగన్ తన దీక్ష ఉద్దేశాల్లో స్పష్టంగా చెప్పారని... ఆ లెక్కన చూస్తే పొంగులేటి పార్టీ వీడటానికి జగన్ దీక్ష కారణం కానే కాదని రాజకీయ పరి శీలకులు అంటున్నారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల దిగువన నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, రాయలసీమకు ఇబ్బందికరంగా మారుతుందని జగన్ చెప్పారు. జగన్ ప్రకటనలోని వాస్తవ విషయాలను విస్మరించి ‘పాలమూరు’ను వ్యతిరేకిస్తున్నందునే పార్టీ వీడుతున్నానంటూ పొంగులేటి ప్రకటించడం కేవలం ఓ సాకు మాత్రమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

పాలేరు ఎన్నికల కోసమే..


ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్... అక్కడ లబ్ధి పొందేందుకే వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆగమేఘాలపై పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పాలేరు ఉప ఎన్నిక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి కేటీఆర్ ఆదివారమే ఎంపీ పొంగులేటిని వెంటబెట్టుకుని వెళ్లి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీంతో పొంగులేటి పార్టీ వీడుతున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారమైంది. సోమవారం ఉదయం పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కలసిన పొంగులేటి... తాను పార్టీ మారడం లేదని చెప్పినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top