కి‘లేడీ’!

కి‘లేడీ’!


► సెలబ్రిటీలకు ఆభరణాలు అమ్ముతానంటూ మోసం

► నగలు స్వాహా చేసిన ప్రముఖ జ్యువెలరీ డిజైనర్‌

► అంగసూత్ర నగల షోరూమ్‌కు రూ.3.5 కోట్ల టోకరా

► బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు




హైదరాబాద్‌:

పేరు... మోనీఅగర్వాల్‌. ప్రముఖ జ్యువెలరీ డిజైనర్‌. కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహించింది. ఇది ఆమెకు ఒకవైపు. మరోవైపు... బంజారాహిల్స్‌లోని ఓ సంస్థకు రూ.3.5 కోట్ల టోకరా వేసింది. సెలబ్రెటీలకు ఆభరణాలు అమ్మిపెడతానంటూ విడతల వారీగా తీసుకుని ముఖం చాటేసింది. దీనిపై జ్యువెలరీ సంస్థ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



బయోడేటా చెప్పి బుట్టలో వేసుకుని...

నగరానికి చెందిన మోనీఅగర్వాల్‌కు ఆభరణాల డిజైనింగ్‌లో మంచి పేరుంది. అనేక మంది సెలబ్రెటీలు, మిస్‌ ఇండియాతో పాటు కొన్ని సంస్థలకూ డిజైనర్‌గా పని చేసింది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లో ఉన్న అంగసూత్ర ఆభరణాల షోరూమ్‌ను మోని 2015లో సంప్రదించింది. ముంబై, హైదరాబాద్‌ల్లో అనేక హోల్‌సేల్, రిటైల్‌ సంస్థలు నిర్వహించే ఘన్‌శ్యామ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ఆధీనంలో ఈ సంస్థ పనిచేస్తోంది. దీని యజమానిని పరిచయం చేసుకున్న మోని అగర్వాల్‌ తాను ప్రముఖులకు ఆభరణాలు డిజైన్‌ చేస్తుంటానని, అనేక ఫ్యాషన్‌ షోలు సైతం నిర్వహించానని చెప్పింది. సినీ తారలు శ్రియాశరణ్, తాప్సీ, రానా దగ్గుబాటి, కేథరిన్‌థ్రెస్సా తదితరులతో తన డిజైన్లను ఫ్యాషన్‌ షోలలో ప్రదర్శించానని తెలిపింది. దీంతో అంగసూత్ర యజమాని ఆమెతో కలసి పని చేసేందుకు అంగీకరించారు. ఇటీవల ఫిక్కీ ఫ్యాషన్‌ షోలో కూడా తన ఆభరణాలను ఆమె ద్వారానే ప్రదర్శించారు.



చెక్కులు బౌన్స్‌...

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న మోని... జనవరి 25న అంగసూత్ర యజమానికి ఫోన్‌ చేసింది. మంచి డిజైన్లున్న బంగారు ఆభరణాలు పంపాలని, వాటిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లోని సెలబ్రిటీలు, సంపన్న వర్గాలకు విక్రయిస్తానని నమ్మించింది. దీంతో యజమాని జూబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి విడతల వారీగా రూ.3,48,59,000 విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలను పంపించారు. తర్వాత తనకు రావాల్సిన నగదు రాకపోవడంతో యజమాని అనేకసార్లు మోనీని సంప్రదించినా... ఆమె అనేక కారణాలు చెబుతూ తప్పించుకుంది. చివరకు తనవద్ద తీసుకున్న ఆభరణాలకు డబ్బు చెల్లించాలంటూ యజమాని ఆమెను గట్టిగా అడిగారు. దీంతో ఇటీవల ఆమె రెండు చెక్కులు రాసిచ్చింది. బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయగా.. అవి బౌన్సయ్యాయి. దీంతో సంస్థ డైరెక్టర్‌ గౌతమ్‌ ఆదివారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top