రాజకీయాలకు పట్టిన చెద బాబు : ఎమ్మెల్యే రోజా

రాజకీయాలకు పట్టిన చెద బాబు :  ఎమ్మెల్యే రోజా - Sakshi


ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎమ్మెల్యేలను కొంటున్నారు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా


 సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులను ఎర వేసి సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. వారికి టీడీపీ కండువాలు కప్పుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాజకీయాలకు పట్టిన చెద చంద్రబాబు. క్యాన్సర్ వ్యాధిలా చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని ఉపేక్షిస్తే.. ఇది అన్ని రాష్ట్రాలకూ పాకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.


‘‘చంద్రబాబు అనైతిక రాజకీయాలను ఎండగట్టడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో సీఎం చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును జాతీయ నేతలకు వివరించారు. చంద్రబాబు అవినీతిని చూసి దేశం నివ్వెరపోతోంది. సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్లడం ఖాయం’’ అని రోజా పేర్కొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు అవినీతిపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతుంటే మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కల్లు తాగిన కోతుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. 


 జైలుకెళ్లిన వారు మమ్మల్ని విమర్శిస్తారా అంటూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతుండటం హేయమని రోజా అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పు చేసి జైలుకెళ్లలేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ నువ్వు నిప్పువైతే ఈ కేసుల్లో సీబీఐ విచారణకు సిద్ధమా’’ అని రోజా సవాల్ విసిరారు.


 బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకే జగన్ పోరాటం

‘‘అవినీతి, అక్రమాలు, నీతిమాలిన రాజకీయాలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను చంద్రబాబు దెబ్బతీస్తుంటే.. రాజధాని, ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమిస్తున్నారు.  రెండేళ్లలో తండ్రీ కొడుకులు దోచుకున్న రూ.1.34 లక్షల కోట్లను ప్రజలకు పంపిణీ చేసి.. క్షమాపణ కోరాలి’’ అని ఆర్.కె.రోజా డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top