నిమిషాల్లో ‘వెరిఫై’ చేస్తారు!

నిమిషాల్లో ‘వెరిఫై’ చేస్తారు!


ఆధునిక సాఫ్ట్‌వేర్ ఏర్పాటుకు కసరత్తు

పరిశీలన పత్రాల జారీ ఇక సులభతరం

మౌస్‌క్లిక్‌తో నేరగాళ్ల పూర్తి వివరాలు సైతం


 

సిటీబ్యూరో:  మల్టీనేషనల్ కంపెనీలతో పాటు కొన్ని కీలక సంస్థల్లో ఉద్యోగాల్లో చేరే వారికి పోలీసులు జారీ చేసే పరిశీలన పత్రం (వెరిఫికేషన్ సర్టిఫికెట్) ఎంతో కీలకం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. ఇది అటు దరఖాస్తుదారుడికి, ఇటు అధికారులకూ ఇబ్బందికరంగా మారింది. కొందరు అభ్యర్థులు నిర్దేశిత గడువు మీరడంతో ఉద్యోగం నిలుపుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.



ముసారాంబాగ్ తీగలగూడ గుడిసెల్లో నివసించే గౌస్ 2010లో మలక్‌పేట ఠాణా పరిధిలోని గడ్డిఅన్నారం పోచమ్మ ఆలయంలో చోరీ చేశాడు. ఆపై మరో నిందితుడైన హైదర్‌తో కలిసి దేవాలయాల్లో వరుస చోరీలు చేస్తూ నగర పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఇతడి వివరాలు మలక్‌పేట పోలీసుల వద్ద మాత్రమే ఉండటంతో  సీసీఎస్ పోలీసులు పట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది.

 

ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ‘వెరిఫై’ పేరుతో తాము తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌కు అవసరమైన మార్పుచేర్పులు చేసి అందించేందుకు ముందుకు వచ్చారు వాల్యూ పిచ్ సంస్థ సీఈఓ వెంకట రమణ.

 

ఏమిటీ ‘వెరిఫై’?



ప్రస్తుతం వివిధ న్యాయస్థానాల్లో ఉన్న కేసుల సమగ్ర వివరాలతో వాల్యూ పిచ్ సంస్థ రూపకల్పిన చేసిన సాఫ్ట్‌వేర్ పేరే వెరిఫై. ముంబై కేంద్రంగా పని చేసే ఈ  సంస్థకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖతో ఒప్పందం ఉంది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1400 కోర్టులకు సంబంధించిన ఐదున్నర కోట్ల రికార్డులతో కూడిన డేటాబేస్‌తో అనుసంధానం ఏర్పడింది. ఆయా న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్, ట్రయల్ దశ, వీగిపోయిన, శిక్షపడిన, రాజీ కుదిరిన కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో ఈ సంస్థకు అందుబాటులో ఉన్నాయి. దీని ఆధారంగా ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన వాల్యూ పిచ్ సంస్థ ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలతో ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది. ప్రస్తుతం మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ సంస్థలకు తమ సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలందిస్తోంది. ఆయా సంస్థల్లో ఉద్యోగంలో చేరే వారి వివరాలు తెలుసుకోవడానికి యాజమాన్యాలు వీరి సహాయం తీసుకుంటున్నారు. అభ్యర్థి పూర్తి పేరు ఎంటర్ చే స్తే చాలు... దేశ వ్యాప్తంగా అతడిపై కేసుల వివరాలు, వాటి పూర్వాపరాలు నిమిషాల్లో తెలిసిపోతాయి.

 

ఇంట్రానెట్‌తో ఠాణాలకు?


 

ఈ డేటాబేస్‌ను అన్ని పోలీసుస్టేషన్లకూ కనెక్టివిటీ కలిసి ఉండే ఇంట్రానెట్‌తో అనుసంధానిస్తారు. ఫలితంగా ప్రస్తుతం ఒకచోట మాత్రమే ఉంటున్న డేటా డివిజన్, జోనల్, కమిషనరేట్‌తో పాటు ఇతర జిల్లాల వరకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఓ నేరం జరిగినప్పుడు ఆ తరహా నేరాలు చేసే వారు, గతంలో పలుసార్లు చేసిన వారు ఎవరు ఉన్నారు? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తక్షణం తెలుసుకోవడంతో పాటు డేటా నుంచే వారి ఫొటో, చిరునామా, వేలిముద్రలు కూడా సంగ్రహించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే డేటా ఉన్నతాధికారులకూ చేరువలో ఉండటంతో కింది స్థాయి సిబ్బంది నేరాల దర్యాప్తులో తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షించడంతో పాటు అనుమానితుల జాబితాలను సక్రమంగా సరిచూసేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. రీపీటెడ్ అఫెండర్లకు చెక్ చెప్పాలంటే వారిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాల్సిందే. ఇలా చేయాలంటే వారు జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతున్నారో పోలీసులు కచ్చితంగా తెలియాలి. అయితే ఇప్పుడు కూడా జైల్ రిలీజ్ డేటాగా పిలిచే ఆ రోజు జైలు నుంచి విడుదలవుతున్న వారి పేర్ల జాబితా పోలీసులకు అందుతోంది. ప్రస్తుతం కేవలం జైలు శిక్ష పూర్తి చేసుకుని (కన్విక్ట్స్) బయటకు వస్తున్న వారి డేటానే జైళ్ల శాఖ పంపిస్తోంది. ఈ రిపీడెట్ అఫెండర్స్‌లో అనేక మంది బెయిల్‌పై బయకు వస్తుండటంతో ఆ వివరాలు తెలియట్లేదు. దీనికి పరిష్కారంగా సీసీఎస్ పోలీసులు బెయిల్ రిలీజ్ అలెర్ట్ సిస్టంను సైతం ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

 

పోలీసు డేటాతో అనుసంధానం....


 

పోలీసు విభాగానికి ఉపయుక్తంగా ఉండాలంటూ ఈ వెరిఫై సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని వివరాలతో కూడిన డేటాబేస్ అవసరమని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నిర్ణయించారు. దీనికోసం పోలీసు డేటాతోనూ అనుసంధానం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన కొన్నేళ్ల గణాంకాలను విశ్లేషించిన సీసీఎస్ అధికారులు ప్రతి 100 నేరాల్లోనూ 85 వరకు పాత నేరగాళ్లే చేస్తున్నట్లు గుర్తించారు. రిపీటెడ్ అఫెండర్స్‌గా పిలిచే వీరిలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. దీన్నే సాంకేతికంగా మోడెస్ ఆపరెండీ అంటారు. దీని ఆధారంగా ప్రాథమిక జాబితాను రూపొందించారు.  దీన్నే మరింతగా విశ్లేషిస్తూ ఆయా నేరగాళ్లలో ఇప్పటి వరకు ఎవరు ఎన్ని సార్లు అరెస్టు అయ్యారు? ఆ కేసులు ఏ కోర్టులో, ఏ స్థితిలో ఉన్నాయి? అనేవి తయారు చేస్తున్నారు. ఈ జాబితాలను సాఫ్ట్‌కాపీల రూపంలో కేటగిరీల వారీగా ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. దీన్ని ‘వెరిఫై’తో అనుసంధానిస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top