అవినీతి జరగనిది ఎక్కడ: యనమల

అవినీతి జరగనిది ఎక్కడ: యనమల - Sakshi


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమవేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలువురు మంత్రులు సభ దృష్టికి వచ్చిన సమస్యలకు సమాధానమిచ్చారు. మంత్రులు ఏమన్నారో వారి మాటల్లోనే..



తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా చేస్తున్న నీటి సరఫరాలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం వల్ల ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు తప్ప ప్రజలకు ప్రయోజనం కల్గడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని చోట్లా అవినీతి ఉన్నట్లే తాగునీటి సరఫరాలో కూడా అవినీతి జరుగుతోంది. తాగునీటి కోసం 13వ ఆర్థిక సంఘం కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు రూ. 214 కోట్లు ఖర్చు చేశాం. 14వ ఆర్థిక సంఘం నిధులు ఇక నుంచి నేరుగా పంచాయతీలకే వెళ్తాయి. అయితే గతంలో మాదిరి మండల పరిషత్, జడ్పీలకు కూడా నిధులు విడుదల చేసే విషయాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్తాం. - ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.



పెండింగులో ఉన్న వేతనాలు చెల్లిస్తాం

పెండింగ్లో ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల వేతనాలను రెండు వారాల్లోగా మంజూరు చేస్తాం. రాష్ట్రంలో 6230 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా పని చేస్తున్నారు. వారికి ఇప్పటి వరకు రూ. 6.33 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన రూ 14.82 కోట్లు విడుదల చేయాలని ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపాం. - సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.



విద్య, ఆరోగ్యం కోసం టీటీడీ నిధులు ఖర్చు చేస్తాం

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నిధులను విద్య, ఆరోగ్యం కోసం కూడా ఖర్చు చేస్తాం.  వెల్లడించారు. అందరి కోరిక మేరకు టీటీడీ పాలక మండలిని ఇక నుంచి ధర్మ టీటీడీ ధర్మకర్తల మండలిగా పిలిచే విధంగా చర్యలు తీసుకుంటాం. కొండపైన షాపుల కేటాయింపుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులు కోరితే టీటీడీ తరఫున రాష్ట్రంలో ఎక్కడైనా దేవాలయాలు నిర్మించి అందులో స్థానికులనే అర్చకులుగా నియమించే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో మరింత మెరుగైన విద్యను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. - దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు.



541 డాక్టర్ పోస్టులు త్వరలో భర్తీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 541 డాక్టర్ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 149 పీహెచ్‌సీల నిర్మాణానికి 13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 129.76 కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు 89 పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేశాం. మరో 6 పీహెచ్‌సీలు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన వెంటనే అవసరమైన సిబ్బందిని నియమిస్తాం.

- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top