ఖమ్మం మార్కెట్‌పై దాడి ..రైతుల పనికాదు

ఖమ్మం మార్కెట్‌పై దాడి ..రైతుల పనికాదు - Sakshi


- స్పష్టం చేసిన మంత్రి తుమ్మల

- కాంగ్రెస్, టీడీపీలు రైతు వ్యతిరేక పార్టీలు

- భూసేకరణకు తొందరెందుకన్న ‘ఉత్తమ్‌’ మూర్ఖుడు




సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం మిర్చి మార్కెట్‌యార్డ్‌పై జరిగిన దాడిని ఖండి స్తున్నామని, ఇది రైతులు చేసిన పని కాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్న తపన ఉన్న నాయకుడన్నారు. శనివారం ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయలో ఆయన మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి, విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం నాటి ఘటనలో రాళ్లు విసిరింది ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ముఠాలేనని, ఎవరు దాడి చేశారో సీసీటీవీ ఫుటేజీ లో  స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.



దేశంలో ఇప్పటికీ మిర్చి పంటకు అధి కంగా ధర ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ వంటి వారికి వ్యవసాయం మీద అవగాహన లేదని, మిర్చి ధరలకు, కేంద్రానికి సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఖమ్మం మార్కెట్‌లో శుక్రవారం జరిగిన సంఘటన ప్రతిపక్షాల పిచ్చికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. రైతులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తుమ్మల పేర్కొన్నారు. ‘పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  మహానాయకుడా, మూర్ఖుడా? ఉత్తమ్‌ మూర్ఖుడయితేనే భూసేకరణకు తొందరేమిటి అని మాట్లాడతారు’ అని మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలు కేవలం రాజకీయ బతుకుదెరువు కోసమే ఈ లఫంగీ పనులు చేస్తున్నారని, వారి పాలనలో ఏనాడైనా పంటలకు సరిగ్గా ధర చెల్లించారా? వారిచ్చిన మద్దతు ధరలపై చర్చకు సిద్ధమా? అని సవాలు చేశారు.



ఓయూలో సీఎం ప్రసంగించకపోవడంపై అనవసర రాద్దాంతం

ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించకపోవడంపై కాంగ్రెస్‌ తదితర పార్టీల నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. విమర్శిస్తున్న వారికి కనీసం ప్రోటోకాల్‌ నిబంధనలు తెలియవన్నారు. ‘2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పాల్గొన్న ఓయూ స్నాతకోత్సవంలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రసంగించ లేదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top