మంత్రికి వాట్సప్ మెసేజ్.. టెన్షన్ ఖతమ్

మంత్రికి వాట్సప్ మెసేజ్.. టెన్షన్ ఖతమ్ - Sakshi

ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన సోదరికి అత్యవరంగా ఆపరేషన్ చేయాలన్నారు. అది కూడా యశోద ఆస్పత్రిలో. ఖర్చు సుమారు నాలుగు లక్షల వరకు వస్తుందని అన్నారు. తనది అంత పెట్టుకోగల ఆర్థిక స్థోమత కాదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన గుగ్గిళ్ల రాజు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వాట్సప్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. అందులో తన పరిస్థితిని వివరించి, ఆస్పత్రి వాళ్లతో ఏమైనా మాట్లాడే వీలుంటే చూడాలని కోరాడు. ఒక అరగంటలో స్పందించిన కేటీఆర్.. తాను తప్పకుండా చూస్తానని రెండే రెండు ముక్కలతో సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించేది కూడా రాజన్న జిల్లా సిరిసిల్లకే కావడంతో రాజు ధైర్యం చేసి మెసేజ్ పెట్టాడు.

 

ఆయన ఏం చేశారో ఏమో తెలియదు గానీ, తమ వద్ద రూపాయి కూడా తీసుకోకుండా ఆస్పత్రి వర్గాలు తమ సోదరికి ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టారని రాజు తెలిపాడు. బహుశా కేటీఆర్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి ఫోన్ చేసి ఉంటారని, డబ్బుల గురించి అడగకుండా ఆపరేషన్ చేయమని చెప్పి ఉండొచ్చని రాజు భావిస్తున్నాడు. తర్వాతి రోజు ఉదయం తనను సచివాలయానికి వచ్చి కలవమన్నారని, ఖర్చుల విషయం తాము చూసుకుంటామని అధికారులు చెప్పారని వివరించాడు. తనకు వేరే అవకాశం ఏమీ లేకపోవడం వల్లే తాను కేటీఆర్‌కు వాట్సప్‌లో సందేశం పంపానని, ఇప్పుడు తన సోదరి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని రాజు ఆనందబాష్పాలతో చెప్పాడు.



Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top