ఉద్యమాలతో అస్థిరపరచవద్దు

ఉద్యమాలతో అస్థిరపరచవద్దు - Sakshi


హోంమంత్రి నాయిని హితవు



సాక్షి, హైదరాబాద్‌: ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అనవసర ఉద్యమాల పేరుతో ప్రభుత్వాన్ని అస్థిర పరచవద్దు. అధికారం శాశ్వతం కాదు. మళ్లీ కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా అధికారంలోకి రావొచ్చు. ప్రభుత్వ పరంగా తప్పులుంటే ఎత్తి చూపాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం సక్రమంగా పనిచేస్తుంది. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో భారత రిపబ్లికన్‌ పార్టీ, దళిత హక్కుల ఉద్యమ నేత ఈశ్వరీబాయి వర్ధంతి సభ జరిగింది.



రాష్ట్ర భాషా, సాంస్కృ తిక శాఖ, ఈశ్వరీబాయి స్మారక ట్రస్టు సం యుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈశ్వరీ బాయి పేరిట మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని పలువురు దళిత నాయకులు, ఈశ్వరీబాయి ట్రస్టు సభ్యులు కోరగా... సీఎంతో మాట్లాడి అందుకు ప్రయత్నిస్తానని నాయిని బదులిచ్చారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని నాయిని చెప్పారు. అసలు సిసలు తెలంగాణ పోరాట యోధురాలు ఈశ్వరీబాయి అని, దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని నివాళులర్పించారు.



ఉద్యమంలో చెన్నారెడ్డి తప్పు లేదు

1969లో తెలంగాణ ఉద్యమం అనంతరం జరిగిన పరిణామాలు, తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తప్పు లేదని నాయిని చెప్పారు. సొంతంగా 10 ఎంపీ సీట్లు గెలిచినా, కేంద్రంలో ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీ సాధించడంతో పరిస్థితులు అనుకూలించ లేదన్నారు. నిధులు, నీళ్లు తదితర అంశాలపై చెన్నారెడ్డి ఒప్పందాలు చేసుకున్నారే తప్ప.. ఎక్కడా లొంగి పోలేదన్నారు. అయితే తర్వాత ఆయన గవర్నర్‌ పదవి తీసుకోవడంతో దుష్ప్రచారానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఈశ్వరీబాయి కుమార్తె, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో ఏక వ్యక్తి సైన్యంగా తన తల్లి గళం విప్పారని, ఆనాటి సీఎంలను సైతం తన ప్రసంగాలతో గడగడలాడించారన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, మండలిలో చీఫ్‌విప్‌ పాతూరి సుధాకరరెడ్డి, కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top