సినిమా చూపిస్త మావ..

సినిమా చూపిస్త మావ.. - Sakshi


బస్టాండ్లలో మినీ థియేటర్లు

ప్రతి పట్టణంలో ఒకటి ఉండేలా ఆర్టీసీ ప్రణాళిక

354 థియేటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన బడా సంస్థ




సాక్షి, హైదరాబాద్‌: ఎక్కాల్సిన బస్సు మిస్సవుతుంది. తరువాత బస్సుకు రెండుమూడు గంటల సమయం పడుతుంటుంది. అప్పటి వరకు ఏం చేయాలి! బస్టాండుల్లో పడిగాపులు కాసేకంటే హాయిగా, ఏసీ హాలులో కూర్చుని ‘కూల్‌’గా ఓ సినిమా చూసొచ్చి తర్వాతి బస్సు అందుకోవచ్చని పిస్తుంది. అందకు ఎక్కడో ఉన్న థియేటర్‌కు వెళ్లి రావాలంటే వ్యయ ప్రయాసలు... పైగా సమయానికి బస్సు అందుకోగలమో లేదో టెన్షన్‌! అదే బస్టాండులోనే ఓ సినిమా హాలుంటే! ఈ ఆలోచనకే కార్యరూపం ఇస్తోంది ఆర్టీసీ. ప్రయాణికులకు వినోదాన్ని కల్పించడమే కాకుండా... తద్వారా ఆదాయం పొందే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండుల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.



ప్రభుత్వానికి ప్రతిపాదన...

దేశీయంగా మినీ థియేటర్ల నిర్వహణలో మంచి పేరున్న ఓ బడా కంపెనీ తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో 354 మినీ థియేర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో వాటి నిర్మాణానికి అనుమతితోపాటు, విధివిధానాల నోటిఫికేషన్‌ కోసం ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అది రాగానే టెండర్లు పిలిచి థియేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పట్టణంలోని బస్టాండులో కనీసం ఓ మినీ థియేటర్‌ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.



నిబంధనల సడలింపుతో స్పందన

ప్రస్తుతం బస్సుల నిర్వహణతోనే ఆదాయాన్ని పొందుతున్న ఆర్టీసీ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరు కుపోయింది. గతంలో తీసుకున్న అప్పుల తాలూకు వడ్డీలు, పాత బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. కచ్చితంగా ప్రత్యామ్నా య రూపంలో ఆదాయాన్ని పొందాల్సిన పరిస్థితిలో బీఓటీ (నిర్మించు, నిర్వహించు, అప్పగిం చు) పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా టిక్కెటేతర ఆదాయం కోసం రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి అధికారి వేణును ఈడీగా నియమించింది. కనీసం 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమైనందున అంతమేర విశాలమైన భవనాలున్న చోట పైభాగంలో థియేటర్లు నిర్మిస్తారు.



భవనాలు లేని చోట బస్టాండులోని ఖాళీ స్థలంలో నిర్మిస్తారు. నిర్మాణ సంస్థలను ఆకట్టుకునేందుకు అసెస్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ వాల్యూ, అప్పెరంట్‌ వ్యాల్యూను తగ్గించారు. ప్రాజెక్టు అప్పగించిన తొలి నెల నుంచే ఆర్టీసీకి వాటా చెల్లించాల్సి ఉండగా, దాన్ని నిర్మాణ సమయం పూర్తయ్యే వరకు వసూలు చేయాల్సిన అవసరం లేకుండా కనిష్టంగా రెండేళ్ల హాలీడే ప్రకటించారు. కనీసం రూ.100 కోట్ల విలువైన ప్రాజెక్టు అయితే రెండేళ్లు, అంతకంటే విలువ ఎక్కువున్న ప్రాజెక్టులకు మూడేళ్ల హాలీడే ప్రకటించారు. వార్షిక లీజ్‌ రెంటల్‌ను కూడా తగ్గించారు. లీజు ఒప్పందం పూర్తయ్యాక, ఆసక్తి ఉంటే మరో 25 ఏళ్లపాటు నిర్వహించుకునేందుకు కేటాయించే విషయంలో ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి.



ముందుకొచ్చిన 14 సంస్థలు...

తాజాగా మినీ థియేటర్లకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేయటంతో 14 సంస్థలు ముందు కొచ్చాయి. మినీ థియేటర్లతో పాటు ఇతర బీఓటీ ప్రాజెక్టుల వల్ల ఆదాయం ఎలా ఉంటుందనే విషయంలో అధ్యయనం కోసం ఈడీ వేణు ఆధ్వర్యంలో అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల్లో పర్యటించను న్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top