పరీక్ష పాస్


మెట్రోకు ఆర్‌డీఎస్‌ఓ ధ్రువీకరణ

 

సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజెక్టు మరో కీలక పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. రైల్వే శాఖకు చెందిన అత్యున్నత ప్రమాణాల సంస్థ రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ-పూణే) ధ్రువీకరణ సాధించింది. ఆ సంస్థ అధికారులు పక్షం రోజుల పాటు నాగోల్-మెట్టుగూడ మార్గంలో 8 మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఉప్పల్ డిపోలోని 8 మెట్రో రైళ్లకు 18 రకాల పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిగ్నలింగ్, రైళ్ల వేగం, లైటింగ్, ట్రాక్షన్, పట్టాలు, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలీ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ, బ్రేకులు, ఆటోమేటిక్ కంట్రోల్ వ్యవస్థలు, ఏసీ పనితీరు, అగ్ని నిరోధక వ్యవస్థల ఏర్పాటు, డిపోల్లో మెట్రో రైళ్ల సర్వీసింగ్, మరమ్మతులకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతనే ఆర్‌డీఎస్‌ఓ సంస్థ తాజాగా కీలకమైన ధ్రువీకరణ జారీ చేసినట్లు తెలిసింది.



దీన్ని త్వరలో రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. ఆ తరవాత రైల్వే శాఖ ఆధ్వర్యంలో క మిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ భద్రతా సర్టిఫికెట్ జారీ చేస్తుంద ని వెల్లడించాయి. ఆ తరవాత మెట్రో తొలిదశకు మార్గం సుగమం అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద మహా నగరాల్లోని మెట్రో రైలు వ్యవస్థలను, అక్కడి లోపాలు, సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు చెప్పారు. ఆ మేరకు   నగర మెట్రో ప్రాజెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఆర్‌డీఎస్‌ఓ నిర్వహించిన అన్ని రకాల పరీక్షల్లోనూ నగర మెట్రో విజయవంతంగా పాసైందని వెల్లడించారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top