జూలై 9న మెడికల్ ఎంసెట్-2

జూలై 9న మెడికల్ ఎంసెట్-2


ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష

 అదే రోజు కీ విడుదల...

14న ర్యాంకుల ప్రకటన

జూన్ 1 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

28న నోటిఫికేషన్

పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేసిన ప్రభుత్వం

 

సాక్షి, హైదరాబాద్: ‘నీట్’ను ఏడాదిపాటు వాయిదావేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మెడికల్ ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 28న ఎంసెట్-2కు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. ఎంసెట్-2 షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 

 అయితే రూ. 500 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు, రూ. వెయ్యి అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు, రూ. 5 వేల అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ. 10 వేల అపరాధ రుసుముతో జూలై 6 నాటికీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లక్ష్మారెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 250గా, ఇతరులకు రూ. 500గా నిర్ణయించారు. జూన్ 8న పరీక్ష నిర్వహణ కమిటీ, 9న ఫస్ట్ రీజనల్ కోఆర్డినేటర్లు వేర్వేరుగా సమావేశం కానున్నారు. జూన్ 15న పరీక్ష కేంద్రాలను ఖరారు చేయనున్నారు.

 

 జూలై 2న రెండో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. జూలై 2 నుంచి 7వ తేదీ వరకు విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంసెట్-2 ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. జూలై 12లోగా ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుపుకోవచ్చు. జూలై 14న ర్యాంకులు ప్రకటించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top