సెప్టెంబర్ చివరి దాకా మెడికల్ అడ్మిషన్లు

సెప్టెంబర్ చివరి దాకా మెడికల్ అడ్మిషన్లు - Sakshi


‘సాక్షి’తో కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి

- నీట్ నేపథ్యంలో ఎంసీఐ ఒక నెల గడువు పొడిగించింది

ఎంసెట్-2కు జూలై ఆఖరుకల్లా తొలి విడత కౌన్సెలింగ్

ఆగస్టు నుంచే తొలి విడత బ్యాచ్ తరగతులు

 

 సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆగస్టు 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి సెప్టెంబర్ చివరి దాకా కొనసాగనుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్-2 షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎంసెట్‌ను జూలై 9వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎంసెట్-2ను విద్యార్థుల సంఖ్యను బట్టి దాదాపు 200 కేంద్రా ల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.



నీట్ ద్వారా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపడుతున్నందున ఆలస్యం కానుందని.. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ఎంసీఐకి అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ నేపథ్యం లో నిర్వహించే ఎంసెట్-2 పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి జూలై ఆఖరి వారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. విద్యార్థుల చేరికలు పూర్తయ్యాక... ఆగస్టులోనే తొలి బ్యాచ్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక రెండో విడత కౌన్సెలింగ్, అవసరమైతే మూడో విడత కూడా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.



 వెబ్ కౌన్సెలింగ్‌పై ఆలోచన

 ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కాకుండా పీజీ వైద్య సీట్లకు నిర్వహించినట్లుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల విద్యార్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి రాకుండానే తమ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వేగంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో కలిసే మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో 15 శాతం అన్ రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నందున కలిసే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంసెట్ ఫలితాలు ఇప్పటికే వచ్చినా రెండు రాష్ట్రాల కౌన్సెలింగ్‌ల మధ్య ఎక్కువ రోజు ల తేడా ఉండబోదన్నారు. తెలంగాణ సీట్లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ అంతా హైదరాబాద్, వరంగల్‌లోనే జరుగుతుందన్నారు.

 

 వచ్చేనెల మొదటివారంలో నీట్-2 నోటిఫికేషన్!

 నీట్-2కు వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామన్నారు. నీట్ ర్యాంకులు ప్రకటించాక సీట్ల భర్తీ ప్రక్రియ ఎలా చేపట్టాలన్న అంశంపై మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. మార్గదర్శకాలు వచ్చాక సీట్ల భర్తీ ప్రక్రియపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top