ఆర్టీసీకి ‘మేడారం’ సవాల్

ఆర్టీసీకి ‘మేడారం’ సవాల్


సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యే అవకాశం. ఇప్పుడిది ఆర్టీసీకి పెద్ద సవాల్‌గా పరిణమించింది. రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరగబోతోంది. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం ఈ వేడుకనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భక్తుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. భక్తులను మేడారానికి చేర్చాల్సిన ఆర్టీసీ కూడా ముందస్తు ప్రణాళికతో రంగంలోకి దిగింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న తొలి వేడుక కావడంతో ఆర్టీసీకి బస్సులు సరిపడక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.



ఈ వేడుకల కోసం 4 వేలకు పైచిలుకు బస్సులను కేటాయించారు. ఇందుకు హైదరాబాద్ నుంచి వేయి సిటీ బస్సులు, దానికి పొరుగు జిల్లాల నుంచి మరో వేయి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ల నుంచి మరో రెండు వేల బస్సులను కేటాయించారు. గత వేడుకల నాటికి రాష్ట్రం ఉమ్మడిగా ఉండటంతో ఆంధ్ర ప్రాంతంలో తిరిగే బస్సులను, అక్కడి సిబ్బందిని వినియోగించుకునేవారు. ఈసారి కేవలం తెలంగాణ బస్సులు, తెలంగాణ ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలనే యోచనలో అధికారులున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రాంతం వారిని స్వస్థలాలకు చేర్చే బాధ్యతను పూర్తిగా ఏపీఎస్‌ఆర్టీసీనే తీసుకుంది. దాదాపు రెండున్నరవేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల మందిని తరలించింది.



తుదకు విజయవాడ నుంచి సిటీ బస్సులను రప్పించి వినియోగించారు. ఇప్పుడు మేడారం జాతరను కూడా తానొక్కటే నిర్వహించాలనే యోచనలో టీఎస్‌ఆర్టీసీ ఉంది. దీంతో సాధారణ బస్సులు సరిపోక వేయి వరకు సిటీ బస్సులను రంగంలోకి దించారు. జాతరకు పిల్లాపాపలతో వచ్చే భక్తులకు వెనక డోర్ ప్రమాదకరంగా మారుతుందన్న ఉద్దేశంతో యుద్ధప్రాతిపదికన ఇనుపరేకులతో మూయించేశారు. చలిగాలుల నుంచి కూడా రక్షణగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా డిపోల్లో తలుపులు మూయించే పని పూర్తి చేసి సోమవారం నుంచి వాటిని వివిధ ప్రాంతాలకు పంపనున్నారు. వీటిల్లో కొన్ని డొక్కు బస్సులు కూడా ఉన్నాయి. వాటిని గ్యారేజీలకు పంపి ఫిట్‌నెస్ పరీక్షించి కొత్త బ్రేకులు, ఇతర అవసరమైన కొత్త పరికరాలు కూడా బిగించేశారు.

 

 20 లక్షల మందికిపైగా...

 గత ఏడాది మేడారం వేడుకలో దాదాపు 18 లక్షల మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. ఈసారి కనీసం 20 లక్షల మంది భక్తులను తరలించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం కూడా రూ.20 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. బస్సుల సంఖ్య పరిమితంగా ఉన్నందున ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కుని సకాలంలో రాకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున వరంగల్ నుంచి మేడారం మార్గం, తిరిగి వచ్చే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వచ్చేమార్గం 20 కి.మీ. దూరం పెరిగింది. కానీ ఎదురురెదురుగా వాహనాలు వచ్చే అవకాశం లేనందున బస్సులు తొందరగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుం దని అధికారులు చెబుతున్నారు. డీజిల్ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రైవేటు బం కుల్లో పోయించుకునే ఏర్పాటు చేశారు. 40 తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top