ఈ ఏడాదికి పాత ఫీజులే!


వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ 

అధికారుల నిర్ణయం


 

సాక్షి, హైదరాబాద్:  ఎంబీబీఎస్ ఫీజుల వ్యవహారం ఇప్పటికీ తేలకపోవడంతో పాత ఫీజులనే నిర్ణయిస్తూ ఈ నెల 30 లేదా ఆగస్టు 2లోగా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయూన్ని ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరులోగా మూడు దశల ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఐదారు రోజుల్లో జూలై ముగిసిపోనుంది. ఈ పరిస్థితుల్లో వారంలోగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రాకపోతే సీట్ల భర్తీ సకాలంలో పూర్తి చేయలేరు.

 

సీట్లు భర్తీ కాని పక్షంలో ఎంసీఐ ఆ ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్నా.. రెండు రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఫీజుల నిర్ణయంపై అధికారులు, ప్రైవేటు యాజమాన్యాల సమావేశం రెండు దఫాలుగా వాయిదా పడింది. ఇంకా జాప్యం చేస్తే సీట్లను కోల్పోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత ఫీజులతోనే నోటిఫికేషన్ జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు.

 

మూడు ప్రాంతాల్లో కౌన్సెలింగ్

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మూడు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ జరిగేది. ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జెఎన్‌టీయూలో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరిగేది. ఇప్పుడు కూడా అదే మూడు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్‌వర్సిటీ అధికారులు నిర్ణయించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top