కలసి నడుద్దాం

కలసి  నడుద్దాం


అధికారులకు మేయర్ పిలుపు

 

ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చేందుకుసమైక్యంగా పని చేద్దామని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు

పిలుపునిచ్చారు. చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని... దీర్ఘ కాలిక లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో సాధించాలని సూచించారు.వీటికి సంబంధించి 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.



సిటీబ్యూరో: దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో.. చిన్న సమస్యలను వెంటనే స్పందించి పూర్తి చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే సమస్యలను సమర్థంగా పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు. శుక్రవారం ఆయన మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో తక్షణమే పూర్తి చేయాల్సినవి, వివిధ విభాగాల్లోని స్వల్ప కాలిక పనులపై 100 రోజుల ప్రణాళికను రూపొందించాల్సిందిగా సూచించారు. నగరాభివృద్ధితో పాటు పౌర సదుపాయాల మెరుగుకు కొత్త పాలకమండలిపై ప్రజలు భారీ ఆకాంక్షలతో ఉన్నారని చెప్పారు. వాటిని నెరవేర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వానికి అనుగుణంగా పనులు చేయాలని సూచించారు.



పన్ను వసూళ్లకు కృషి చేస్తాం

అభివృద్ధి పనులకు నిధుల అవసరం ఉన్నందున సమర్థంగా ఆస్తిపన్ను వసూలు చేయాలని పిలుపునిచ్చారు. భారీ బకాయిలు ఉన్న వారి నుంచి ఆస్తిపన్ను వసూళ్లకు తనతో పాటు డిప్యూటీ మేయర్ కూడా ప్రత్యేకంగా కృషి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో సిబ్బంది కొరత తీర్చేందుకు సీఎంతో చర్చిస్తామన్నారు. స్టాండింగ్  కమిటీ, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. వివిధ పథకాల అమలులో ఎదురువుతున్న సవాళ్లను మేయర్‌కు వివరించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్‌నాయుడు, రామకృష్ణారావు, శంకరయ్య, రవికిరణ్, కెనెడి, భాస్కరాచారి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top