ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం - Sakshi


- యువతిని హత్య చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్

- పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్నందుకే

- మిస్టరీ ఛేదించిన చాదర్‌ఘాట్ పోలీసులు




హైదరాబాద్ : ఆమె ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్.. అతడో ట్యాక్స్ కన్సల్టెంట్... ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ చాటింగ్‌తో సన్నిహితంగా మారారు. పెళ్లి చేసుకోమంటూ ఆమె ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు. శవాన్ని మూటకట్టి మూసీనదిలో పడేశాడు... మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసు మిస్టరీని చాదర్‌ఘాట్ పోలీసులు ఆదివారం ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మల్లేష్ కుమార్తె జానకి (26) బర్కత్‌పురలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసేది. ఈమెకు దాదాపు ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా నాగోలు బండ్లగూడకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్‌తో పరిచయమైంది. దీంతో వీరిద్దరూ నిత్యం చాటింగ్ ద్వారా సంభాషించుకునేవారు. ఇలా పెరిగిన పరిచయంతో ఇరువురూ సన్నిహితమయ్యారు. ఆరు నెలల నుంచి జానకి తనను వివాహం చేసుకోవాల్సిందిగా యశ్వంత్‌పై ఒత్తిడి చేస్తోంది. దీంతో ఫేస్‌బుక్ అకౌంట్‌ను డీ-యాక్టివేట్ చేసిన అతడు జానకికి దూరంగా ఉండటం ప్రారంభించాడు. దీంతో యశ్వంత్ తనను మోసం చేస్తున్నాడని భావించిన జానకి తరచూ  ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు చేస్తూ తనను వివాహం చేసుకోవాలని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది.



హత్య చేయడం ద్వారా జానకిని వదిలించుకోవాలని కుట్ర పన్నిన యశ్వంత్ కుమార్ పథకం ప్రకారం ఈ నెల 17న ఆమెకు ఫోన్ చేశాడు. కీలక విషయాలు చర్చిద్దామంటూ బండ్లగూడలోని తన గదికి ఆహ్వానించాడు. అప్పటికీ అతడిపై నమ్మకం ఉన్న జానకి ఆఫీస్‌కు వెళ్తున్నానంటూ తన ఇంట్లో చెప్పి బండ్లగూడలోని యశ్వంత్ గదికి వెళ్లింది. మళ్లీ వీరి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో జానకి గొంతు నులమడంతోపాటు దిండుతో ఊపిరి ఆడకుండా చేసిన యశ్వంత్ దారుణంగా హత్య చేశాడు. మృతదేహం కాళ్లు చేతులు కట్టేసి అర్ధరాత్రి వరకు తన గదిలోనే ఉంచాడు. రాత్రి 12 గంటల ప్రాంతంలో బియ్యం బస్తాలో మూటకట్టి తన స్కూటీపై తీసుకుని వెళ్లి మూసీ నదిలో పడేశాడు. 17న ఆఫీస్‌కు వెళ్లిన జానకి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అనేక చోట్ల ఆరా తీసినా ఫలితం లభించలేదు.



దీంతో జానకి బావ సంజీవరావు 20న చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తప్పిపోయినట్లు (మిస్సింగ్) కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఇన్‌స్పెక్టర్ జి.సత్తయ్య అనేక కోణాల్లో ఆరా తీశారు. సాంకేతిక ఆధారాలను బట్టి జానకి అనేకసార్లు యశ్వంత్‌తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే జానకితో పరిచయం, సాన్నిహిత్యం, హత్య తదితర అంశాలు బయటపెట్టాడు. మూసీనదిలో గాలింపు జరిపిన చాదర్‌ఘాట్ పోలీసులు గౌరెల్లి ప్రాంతం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఉన్న జానకి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. జానకి హత్య విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top