ప్రధాని మోదీకే అచ్చే దిన్: ఖర్గే

ప్రధాని మోదీకే అచ్చే దిన్: ఖర్గే - Sakshi


ప్రజలకు చెడు రోజులే

టూరిస్టు ప్రధాని అంటూ ధ్వజం


 సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో మోదీకి మాత్రమే అచ్చే దిన్ వచ్చాయి. సామాన్య ప్రజలకు మాత్రం బురే దిన్ (చెడు రోజులు) వచ్చాయి’’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోకుండా రెండేళ్ల ‘అధికార’ సంబరాలు చేసుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి తగదన్నారు. తన రక్తంలోనే డబ్బులు ప్రవహిస్తున్నాయనడం ద్వారా ఆయన తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎంతమంది మోదీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు. ప్రధానిగాఈ రెండేళ్లలో సాధించిందేమిటో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.


శనివారం గాంధీభవన్‌లో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. దేశ సమస్యలను పట్టించుకోకుండా మోదీ కేవలం టూరిస్టు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘విదేశాల్లోని మన నల్లధనాన్ని వెలికితీసి యువతకు పంచుతానన్న హామీపైనా మోసం చేశారు. రెండేళ్లలో నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదు. వ్యవసాయ రంగం కుంటుబడింది.


ఆహారోత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. కరువు నివారణ చర్యల్లోనూ విఫలమైంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నీ నిర్వీర్యం చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు నంది ఎల్లయ్య, వి.హన్మంతరావు, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి జె.గీతా రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top